Share News

పాక్‌ మధ్యవర్తిత్వానికి ఒప్పుకోం

ABN , Publish Date - Mar 31 , 2026 | 05:02 AM

అమెరికా- ఇరాన్‌ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించి అంతర్జాతీయంగా పేరుప్రతిష్టలు సంపాదించాలన్న పాకిస్థాన్‌ ఆశలపై ఇరాన్‌ నీళ్లు చల్లింది.

పాక్‌ మధ్యవర్తిత్వానికి ఒప్పుకోం

  • మధ్యవర్తిత్వ ప్రయత్నాలన్నీ వారి వ్యక్తిగతం: ఇరాన్‌

ముంబై, మార్చి30: అమెరికా- ఇరాన్‌ యుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించి అంతర్జాతీయంగా పేరుప్రతిష్టలు సంపాదించాలన్న పాకిస్థాన్‌ ఆశలపై ఇరాన్‌ నీళ్లు చల్లింది. పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వానికి తాము ఏమాత్రం ఒప్పుకోబోమని తేల్చిచెప్పింది. ముంబైలోని ఇరాన్‌ కాన్సులేట్‌ సోమవారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మధ్యవర్తిత్వానికి సిద్ధమని, ఇరు దేశాల ప్రతినిధుల మధ్య ఇస్లామాబాద్‌లో చర్చలకు ఏర్పాట్లు చేస్తామని పాకిస్థాన్‌ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, పాక్‌ మధ్యవర్తిత్వ ప్రయత్నాలన్నీ వారి వ్యక్తిగతమని, తమకు సంబంధం లేదని ఇరాన్‌ స్పష్టంచేసింది. ‘అమెరికాతో ప్రత్యక్ష్యంగా చర్చలే జరగటం లేదు. ఇప్పటివరకు బయటకు వచ్చినవన్నీ అనధికారిక మార్గాల ద్వారా వచ్చిన అసమంజసమైన డిమాండ్లు మాత్రమే. పాకిస్థాన్‌ మధ్యవర్తిత్వంలో మేం చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదు. చర్చలపై అమెరికా తరచూ మాట మారుస్తోంది. మా విధానం మాత్రం సుస్పష్టం. యుద్ధం ముగింపునకు ఈ ప్రాంతం నుంచి ప్రతిపానద వస్తే సంతోషమే. కానీ, ఆ ప్రతిపాదన ఎవరి నుంచి అనేదే అసలు విషయం’ అని ఇరాన్‌ కాన్సులేట్‌ పేర్కొంది.

Updated Date - Mar 31 , 2026 | 05:02 AM