Share News

హిందూ పీఠాధిపతి పాదాలకు మొక్కిన ఇరాన్‌ అధ్యక్షుడు?

ABN , Publish Date - Sep 14 , 2026 | 05:04 AM

ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ ఢిల్లీలో ఒక హిందూ పీఠాధిపతి పాదాలకు నమస్కరించిన వీడియో తీవ్ర దుమారం రేపింది. అయితే, ఇందులో వాస్తవం లేదని ఇరాన్‌ రాయబార కార్యాలయం వర్గాలు స్పష్టం చేశాయి.

హిందూ పీఠాధిపతి పాదాలకు  మొక్కిన ఇరాన్‌ అధ్యక్షుడు?
hindu

  • ఢిల్లీ ఒబెరాయ్‌ హోటల్‌లో ఘటన

  • తోసిపుచ్చిన ఇరాన్‌ ఎంబసీ వర్గాలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌ ఢిల్లీలో ఒక హిందూ పీఠాధిపతి పాదాలకు నమస్కరించిన వీడియో తీవ్ర దుమారం రేపింది. అయితే, ఇందులో వాస్తవం లేదని ఇరాన్‌ రాయబార కార్యాలయం వర్గాలు స్పష్టం చేశాయి. 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు కోసం పెజెష్కియాన్‌ భారత్‌కు విచ్చేయడం తెలిసిందే. ఈ పర్యటనను పురస్కరించుకుని ఇరాన్‌ రాయబారి ఢిల్లీలోని ఒబెరాయ్‌ హోటల్‌లో విందు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ మతపెద్దలు, గురువులు, మేధావులు, వ్యాపారవేత్తలను ఆహ్వానించారు. అలాగే, ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ప్రేమేశ్వర్‌ధామ్‌ పీఠాధిపతి, జగద్గురు స్వామి సతీషాచార్య మహారాజ్‌ కూడా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అందులో సతీషాచార్య చేయిని పట్టుకున్న పెజెష్కియాన్‌ నవ్వుతూ సంభాషిస్తున్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా కిందకు వంగారు. ఆయన చుట్టూ పలువురు నిలబడి ఉండడంతో అసలేం జరిగిందన్నది వీడియోలో కనిపించడం లేదు. కానీ, హిందూ ఆధ్యాత్మిక గురువు పాదాలకు పెజెష్కియాన్‌ మొక్కారంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. అయితే, ఈ వీడియో వాస్తవాలను ప్రతిబింబించడం లేదని, దాన్ని మార్చి (ఎడిటింగ్‌) ప్రచారం చేస్తున్నారని ఇరాన్‌ రాయబార వర్గాలు పేర్కొన్నాయి. ఒక నాయకుడు పెజెష్కియాన్‌కు లేఖ అందించగా అది అనుకోకుండా కింద పడడంతో.. దాన్ని తీసుకునేందుకే ఆయన వంగినట్టు స్పష్టం చేశాయి. కాగా, ఒబెరాయ్‌ హోటల్‌లో రాత్రి విందుకు ఇరాన్‌ రాయబారి ఆహ్వానం మేరకు తాను వెళ్లానని స్వామి సతీషాచార్య మహారాజ్‌ తెలిపారు. అక్కడ తాను భారత్‌లో ఇరాన్‌ రాయబారి మహమ్మద్‌ ఫతాలితోపాటు.. భారత్‌లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ప్రతినిధి ఇలాహితో భేటీ అయినట్లు వెల్లడించారు.

Updated Date - Sep 14 , 2026 | 05:04 AM