Share News

దుబాయిలో భయంభయం

ABN , Publish Date - Mar 02 , 2026 | 02:43 AM

పర్యాటకులు, ధనవంతులు, వ్యాపారాలకు స్వర్గధామంగా గుర్తింపు పొందిన దుబాయి నగరం ఇరాన్‌ ప్రతీకార దాడులతో వణికిపోయింది.

దుబాయిలో భయంభయం

  • నగరంపై ఆదివారం కూడా ఇరాన్‌ దాడులు.. పేలుళ్లతో భయకంపితులైన ప్రజలు

  • దాడిని తిప్పికొట్టామన్న ప్రభుత్వం

  • డ్రోన్‌ శకలాలు పడి ఇద్దరికి గాయాలు

  • ఐకానిక్‌ బుర్జ్‌ అల్‌ అరబ్‌లో మంటలు

హైదరాబాద్‌ సిటీ, మార్చి1(ఆంధ్రజ్యోతి): పర్యాటకులు, ధనవంతులు, వ్యాపారాలకు స్వర్గధామంగా గుర్తింపు పొందిన దుబాయి నగరం ఇరాన్‌ ప్రతీకార దాడులతో వణికిపోయింది. శనివారం నుంచి క్షిపణులు, డ్రోన్లతో వరుస దాడులు చేస్తున్న ఇరాన్‌.. ఆదివారం కూడా దాడి చేసింది. ఈ దాడులను సమర్ధంగా తిప్పికొట్టామని దుబాయి ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. నిత్యం ప్రశాంతంగా ఉండే నగరంలో భారీ పేలుళ్ల శబ్దాలు, మంటలు, ఆకాశంలోకి లేస్తున్న దట్టమైన పొగ.. స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. చాలామంది స్థానికులు, పర్యాటకులు దాడులకు సంబంధించిన వీడియోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంగా ఉందని చెప్పారు. ముందుజాగ్రత్తగా ప్రజలను ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఇరాన్‌ నుంచి వచ్చిన క్షిపణులు, డ్రోన్లన్నింటినీ కూల్చివేశామని ప్రకటించింది. అయితే, జెబెల్‌ అలీ పోర్టు సమీపంలో ఇరాన్‌ ప్రయోగించిన ఓ డ్రోన్‌ పడి భారీగా మంటలు చెలరేగాయి. దుబాయి గగన రక్షణ వ్యవస్థ కూల్చివేసిన ఇరాన్‌ డ్రోన్‌ శకలాలు పడటంతో పామ్‌ హోటల్‌లో స్వల్పంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయని, వారు ఆస్పత్రిలో కోలుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

బుర్జ్‌ అల్‌ అరబ్‌ను తాకిన డ్రోన్‌ శకలాలు

ఇరాన్‌ దాడితో దుబాయిలోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన భవనాలుగా గుర్తింపు పొందిన బుర్జ్‌ ఖలీఫా, బుర్జ్‌ అల్‌ అరబ్‌లకు ముప్పు ఏర్పడింది. శనివారం రాత్రి ఇరాన్‌ డ్రోన్‌ శకలాలు బుర్జ్‌ అల్‌ అరబ్‌ భవనాన్ని తాకటంతో అది స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్తగా ఈ రెండు భవనాలను అధికారులు ఖాళీ చేయించారు. ఆదివారం తెల్లవారుజామున మూడు భారీ పేలుళ్లు వినిపించాయని స్థానికులు చెప్పారు. కృత్రిమంగా సృష్టించిన విలాసవంతమైన పామ్‌ జుమైరా దీవిలో కూడా డ్రోన్‌ పడటంతో మంటలు చెలరేగాయి. కాగా, నగరంలో పరిస్థితి అంతా మామూలుగానే ఉందని దుబాయి మీడియా కార్యాలయం ప్రకటించింది.


అతిపెద్ద ఆస్పత్రి సిద్ధం

అత్యవసర వైద్యసేవల కోసం దుబాయిలో 1,200 పడకల రషీద్‌ ప్రభుత్వాసుపత్రిని సిద్ధం చేసినట్లు అక్కడ సేవలందిస్తున్న ఓ భారతీయ వైద్యుడు చెప్పారు. 400మంది నర్సింగ్‌ సిబ్బంది, 200మందికిపైగా వైద్యులను ఉంచినట్లు తెలిపారు. నగరంలో వందలకొద్ది అంబులెన్సులను సిద్ధంగా ఉంచారని అన్నారు.

1.jpg

భయంగానే గడుపుతున్నాం..

దుబాయిలో పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉంది. ఆదివారం మధ్యాహ్నానికి పేలుళ్లు పెరిగాయి. అయినా పరిస్థితి అదుపులోనే ఉంది. సామాన్య జనజీవనానికి పెద్దగా అంతరాయాలు ఏమీ లేవు. ఇళ్లకే పరిమితమయ్యాం. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయం వెంటాడుతున్నా, ఇక్కడి ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది. యూఏఈ ఇప్పటికే ఎన్నో జాగ్రత్త చర్యలు చేపట్టింది.

- వి. రాజేష్‌, దుబాయి

2.jpg

క్షేమంగానే ఉన్నాం

అల్బేనియాలో చెఫ్‌గా పనిచేస్తున్నాను. రంజాన్‌ సెలవులు కావడంతో భారత్‌కు బయలుదేరిననేను.. కనెక్టింగ్‌ ఫ్లైట్‌ కోసం దుబాయిలో ఫిబ్రవరి 28న ఆగాను. అదే రోజు మధ్యాహ్నం విమానాలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో మమ్మల్ని హోటల్‌కు తరలించారు. అయితే, క్షిపణులు, డ్రోన్ల శబ్దాలు భారీగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మేమంతా క్షేమంగా ఉన్నాం. భోజన వసతులకు లోటు లేకుండా దుబాయి ప్రభుత్వం మాకు అన్ని ఏర్పాట్లు చేసింది.

- ఉదయ్‌కిరణ్‌, చెఫ్‌

Updated Date - Mar 02 , 2026 | 02:44 AM