Share News

1973 తరహా సంక్షోభం తప్పదా?

ABN , Publish Date - Mar 10 , 2026 | 04:50 AM

ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాలకు చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్‌ జలసంధి మూసివేత, గల్ఫ్‌ దేశాల్లో చమురు క్షేత్రాలపై దాడుల కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి.

1973 తరహా సంక్షోభం తప్పదా?

న్యూఢిల్లీ, మార్చి 9: ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాలకు చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్‌ జలసంధి మూసివేత, గల్ఫ్‌ దేశాల్లో చమురు క్షేత్రాలపై దాడుల కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. నెల రోజుల క్రితం 70 డాలర్ల కంటే తక్కువగా ఉన్న బ్రెంట్‌ క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర సోమవారం 120 డాలర్లకు చేరి.. మళ్లీ 100-102 డాలర్లకు తగ్గింది. కానీ.. ప్రస్తుత పరిస్థితులు, ఐఆర్‌జీసీ హెచ్చరికలు చూస్తుంటే చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. 1973 తరహాచమురు సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. హోర్ముజ్‌ జలసంధిలో పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న రోజుకు 10 కోట్ల బ్యారెళ్ల డిమాండ్‌ను తీర్చడం కష్టమేనని.. ఈ పరిణామం చరిత్రలోనే అతిపెద్ద చమురు సంక్షోభానికి దారితీయవచ్చనే ఆందోళనలున్నాయి.

1973లో ఏం జరిగిందంటే..

ప్రపంచ చమురు వాణిజ్యంలో అతిపెద్ద సంక్షోభంగా 1973ని వ్యవహరిస్తారు. అరబ్‌-ఇజ్రాయెల్‌ యుద్ధ సమయంలో ఈ పరిస్థితి నెలకొంది. అప్పట్లో 40 నుంచి 55 లక్షల బ్యారెళ్ల చమురు సరఫరా తగ్గిపోయింది. ఈ కొరత కారణంగా అప్పట్లో బ్యారెల్‌ 3 డాలర్లుగా ఉన్న ధర.. 12 డాలర్లకు పెరిగింది. అలాగే 1978-79లో ఇరాన్‌లో ఇస్లామిక్‌ విప్లవం సమయంలోనూ ఆయిల్‌ ధరలు భగ్గుమన్నాయి. అప్పట్లో 14 డాలర్లు ఉన్న బ్యారెల్‌ ధర ఏకంగా 39 డాలర్లకు చేరుకుంది. ఇరాన్‌-ఇరాక్‌ యుద్ధ సమయంలోనూ దాదాపు 40 లక్షల బ్యారెళ్ల సరఫరా తగ్గడంతో చమురు ధరలు 25 శాతం పెరిగాయి. అలాంటిది ఇప్పుడు హోర్ముజ్‌ జలసంధి మూసివేతతో దాదాపు 2 కోట్ల బ్యారెళ్ల చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అందుకే ఇంత ఆందోళన వ్యక్తమవుతోంది.


ఆసియా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం!

అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రకారం.. హోర్ముజ్‌లో ప్రతిరోజూ 2 కోట్ల బ్యారెళ్ల చమురు, పెట్రోలియం ఉత్పత్తులతో కూడిన నౌకలు ప్రయాణిస్తుంటాయి. ప్రపంచ వినియోగంలో ఇది దాదాపు 20 శాతం. దీనిలో ఎక్కువ శాతం ఆసియా దేశాలకే వెళ్తుంటాయి. ఈ జలసంధి ద్వారా వెళ్లే ముడి చమురులో దాదాపు సగం భారత్‌, చైనా, జపాన్‌, దక్షిణ కొరియాకు వెళ్తాయి. కాబట్టి దీని సరఫరాలో నిరంతర అంతరాయం ముందుగా ఆసియా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపనుంది.

ఇరాక్‌లో 70 శాతం తగ్గిన ఉత్పత్తి

అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాక్‌లోని దక్షిణ ప్రాంతంలో ఉన్న చమురు క్షేత్రాల్లో ఉత్పత్తి 70శాతం తగ్గిపోయింది. ఈ ప్రాంతంలో యుద్ధం ప్రారంభానికి ముందు రోజుకు సగటున 43లక్షల బ్యారెళ్ల ముడిచమురు ఉత్పత్తి అయితే.. ప్రస్తుతం అది 13లక్షల బ్యారెళ్లకు పడిపోయింది. హోర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేయడంతో.. సరఫరా తగ్గిపోయిందని, ఇప్పటికే బయటకు తీసిన ముడిచమురు పేరుకుపోతుండడంతో ఉత్పత్తిని తగ్గించేశామని ఇరాక్‌కు చెందిన బార్సా ఆయిల్‌ కంపెనీ అధికారి తెలిపారు. హోర్ముజ్‌ జలసంధిలో నౌకల రవాణాను నిలిపివేసిన తర్వాత ఇంధన ఉత్పత్తిని తగ్గించిన తొలి దేశంగా ఇరాక్‌ నిలిచింది.

Updated Date - Mar 10 , 2026 | 04:50 AM