Legal Dispute: ‘ఐ ప్యాక్’ పంచాయితీ సుప్రీంకు..
ABN , Publish Date - Jan 15 , 2026 | 04:49 AM
‘ఐ ప్యాక్’ అధిపతి ఇంట తనిఖీల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), అధికార తృణమూల్ కాంగ్రెస్ పోటాపోటీగా దాఖలు చేసిన పిటిషన్లను కలకత్తా హైకోర్టు కొట్టివేసింది.
మమత, ఈడీ పిటిషన్లు కొట్టేసిన కలకత్తా హైకోర్టు
నేటి నుంచి ఈడీ పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ
కోల్‌కతా, జనవరి 14 : ‘ఐ ప్యాక్’ అధిపతి ఇంట తనిఖీల వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), అధికార తృణమూల్ కాంగ్రెస్ పోటాపోటీగా దాఖలు చేసిన పిటిషన్లను కలకత్తా హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఈ పంచాయితీ చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. తనిఖీలు జరుపుతుండగానే, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ...ఐ ప్యాక్ అధిపతి ప్రతీక్ జైన్ ఇంటికి చేరుకుని, ల్యాప్‌టాప్, ఫోన్, పత్రాలను తన వెంట తీసుకెళ్లారని హైకోర్టుకు ఈడీ ఫిర్యాదు చేసింది. దీనిపై మమత తరఫున ఆమె పార్టీ కౌంటరు పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సువ్రా ఘోష్ నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ విచారణ జరిపింది. తమ పార్టీకి సంబంధించిన ఎన్నికల వ్యూహాలు, ఇతర ముఖ్యమైన సమాచారం ఉన్న పత్రాలను ఈడీ అధికారులు తీసుకెళ్లారని తృణమూల్ తరఫు న్యాయవాది మేనకా గురుస్వామి ఆరోపించారు. ఈడీ బెదిరింపులకు గురిచేస్తోందని, దాడి పద్ధతిలో తనిఖీలు చేపడుతోందని విమర్శించారు. ‘‘మేం ఈడీ దర్యాప్తును అడ్డుకోవడం లేదు. సుప్రీంకోర్టులోని పిటిషన్‌తో మాకు సంబంధం లేదు. మా పార్టీకి సంబంధించిన పత్రాలను ఈడీ తనిఖీ చేసింది. ఆ పత్రాలు వేరేవారి చేతికి చేరకుండా చూడాలని, వాటిని తిరిగి మాకు అప్పగించాలని మాత్రమే అభ్యర్థిస్తున్నాం.’’ అని గురుస్వామి వాదించారు. తమ పిటిషన్ సుప్రీంకోర్టు పరిశీలనలో ఉన్నందున విచారణను వాయిదా వేయాలని ఈడీ అభ్యర్థించింది. ‘మేం ఎక్కడకూ పారిపోవడం లేదు.
సుప్రీంకోర్టులో పిటిషన్ ఉన్నప్పుడు దిగువ కోర్టులు విచారణ జరపరాదనే న్యాయ సూత్రాన్ని పరిగణించండి. విచారణను ఒక వారం వాయిదా వేస్తే వచ్చిన నష్టం ఏమీ ఉండదు’’ అని వివరించింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ఇరువురి పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఈడీ వేసిన పిటిషన్‌పై గురువారం నుంచి సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం కానుంది. తనిఖీల్లో పాల్గొన్న అధికారులపై బెంగాల్ పోలీసులు చొరబాటు, నేరపూరిత ఉద్దేశం తదితర సెక్షన్ల కింద దాఖలుచేసిన నాలుగు కేసులను కొట్టివేయాలని, బెంగాల్ సీఎం, డీజీపీలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని తన పిటిషన్‌లో ఈడీ కోరింది.