Share News

యోగా డే వేడుకలకు సర్వం సిద్ధం

ABN , Publish Date - Jun 21 , 2026 | 04:20 AM

అంతర్జాతీయ యోగా డే వేడుకలకు దేశ, విదేశాల్లో సర్వం సిద్ధమైంది. ఆదివారం(జూన్‌ 21న) జరగబోయే 12వ ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ ప్రధాన కార్యక్రమానికి పశ్చిమబెంగాల్‌...

యోగా డే వేడుకలకు సర్వం సిద్ధం

  • విదేశాల్లోని 2,500 ప్రాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు

  • కోల్‌కతాలోని ‘రెడ్‌ రోడ్‌’లో వేడుకలకు మోదీ సారథ్యం

న్యూఢిల్లీ, జూన్‌ 20: అంతర్జాతీయ యోగా డే వేడుకలకు దేశ, విదేశాల్లో సర్వం సిద్ధమైంది. ఆదివారం(జూన్‌ 21న) జరగబోయే 12వ ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ ప్రధాన కార్యక్రమానికి పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతా ఆతిథ్యం ఇవ్వనుంది. బెంగాల్‌లో బీజేపీ తొలిసారి అధికారం చేపట్టిన నేపథ్యంలో యోగా వేడుకలకు కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆ రాష్ట్రాన్ని ఎంచుకోవడం గమనార్హం. చారిత్రక ‘రెడ్‌ రోడ్డు’లో జరిగే ఈ వేడుకల్లో ప్రధాని మోదీ స్వయంగా పాల్గొని, యోగా ప్రదర్శనలకు నాయకత్వం వహించనున్నారు. అలాగే ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్‌ (ఐసీసీఆర్‌)’ సమన్వయంతో విదేశాల్లోని 210కి పైగా రాయభార కార్యాలయాలు దాదాపు 2,500 ప్రాంతాల్లో ఈసారి యోగా కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది ‘యోగా ఫర్‌ హెల్తీ ఏజింగ్‌ (ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా)’ అనే థీమ్‌తో వేడుకలు జరుగుతున్నాయి. కోల్‌కతాలోని ‘రెడ్‌రోడ్‌’లో ఉదయం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రధాన వేడుకల్లో సుమారు 35 వేల మంది ప్రత్యక్ష పాల్గొననున్నట్లు సమాచారం. అలాగే ఆయుష్‌ మంత్రిత్వశాఖకు చెందిన యోగా సంగమ్‌ పోర్టల్‌లోని ‘కామన్‌ యోగా ప్రోటోకాల్‌’ ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థలు, సంఘాలు ఏకకాలంలో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి యోగా చేసేందుకు దేశవ్యాప్తంగా 6 లక్షల సంస్థలు తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు ఆయు్‌షశాఖ పేర్కొంది. భారత సాంస్కృతిక వారసత్వాన్ని యోగా సంప్రదాయంతో ముడిపెడుతూ.. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత పురావస్తు శాఖ (ఏఎ్‌సఐ) సంయుక్తంగా దేశంలోని 100 ప్రముఖ చారిత్రక ప్రదేశాల్లో ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. వీటిలో ప్రధానంగా ఎర్రకోట, హరిద్వార్‌, కోణార్క్‌, హంపి, మహాబలిపురం, హైదరాబాద్‌ వంటి ప్రాంతాలు ఉన్నాయి.

Updated Date - Jun 21 , 2026 | 04:20 AM