డిజిటల్ అరెస్ట్ పేరుతో రిటైర్డ్ శాస్త్రవేత్తకు 1.25కోట్ల బురిడీ!
ABN , Publish Date - Oct 15 , 2026 | 03:53 AM
డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ రిటైర్డ్ శాస్త్రవేత్త నుంచి ఏకంగా రూ.1.25కోట్లు కాజేసిన అంతర్జాతీయ సైబర్ ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. ఈ దందాకు సంబంధించి కాంబోడియా, ఆగ్నేయాసియా దేశాల హ్యాండ్లర్లతో సంబంధాలున్న 11 మంది కేటుగాళ్లను అరెస్ట్ చేశారు.
అంతర్జాతీయ సైబర్ ముఠా గుట్టురట్టు
11మంది నిందితుల అరెస్ట్
దేశంలో రూ.73 కోట్ల మేర సైబర్ నేరాలతో సంబంధం
ఏపీకి చెందిన వృద్ధుడి కేసులో రూ. 7.25కోట్లు ఫ్రీజ్
న్యూఢిల్లీ, అక్టోబరు 14: డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ రిటైర్డ్ శాస్త్రవేత్త నుంచి ఏకంగా రూ.1.25కోట్లు కాజేసిన అంతర్జాతీయ సైబర్ ముఠా గుట్టును ఢిల్లీ పోలీసులు రట్టు చేశారు. ఈ దందాకు సంబంధించి కాంబోడియా, ఆగ్నేయాసియా దేశాల హ్యాండ్లర్లతో సంబంధాలున్న 11 మంది కేటుగాళ్లను అరెస్ట్ చేశారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖలో డైరెక్టర్గా పనిచేసి ఢిల్లీలో విశ్రాంత జీవనం గడుపుతున్న ప్రదీప్ కుమార్ దాస్(69)కు ఆగస్టు 14న ఓ ఫోన్కాల్ వచ్చింది. ఎన్ఐఏ అధికారులమంటూ మాట్లాడిన గుర్తు తెలియని వ్యక్తులు.. ఆయన వివరాలు ఉపయోగించి పెద్దఎత్తున మనీలాండరింగ్ జరిగిందని, అరెస్ట్ చేస్తామని భయపెట్టారు. కేసు నుంచి బయటపడాలంటే తమ ఖాతాల్లో డబ్బులు వేయాలన్నారు. ప్రదీప్ కుమార్ రూ.1.25కోట్లను నిందితులు చెప్పిన 3అకౌంట్లకు బదిలీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటిజిక్ ఆపరేషన్స్ యూనిట్ రంగంలోకి దిగింది. నిందితుల ఖాతాలు, టెలిగ్రామ్ చాట్లను విశ్లేషించగా.. ఈ ముఠాకు వివిధ రాష్ట్రాల్లో 78 సైబర్ ఫిర్యాదులతో సంబంధమున్నట్లు, మొత్తం రూ.73కోట్ల మేర అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు. ఏపీలోని విజయవాడకు చెందిన 79ఏళ్ల వృద్ధుడి నుంచి కాజేసిన రూ. 7.25కోట్లను స్తంభింపచేయగలిగారు.