దోశ... ఆమ్లెట్ అడగొద్దు!
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:08 AM
కొన్నాళ్లు క్యాంటీన్లలో దోశ, ఆమ్లెట్ అడగకండి... ఇదీ... ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు పంపిన ఈమెయిల్ సందేశం.
ఇంటి ఆహారం తెచ్చుకుంటే ఇంకా మంచిది!!
ఉద్యోగులకు ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ సందేశం
బెంగళూరు, మార్చి 12: కొన్నాళ్లు క్యాంటీన్లలో దోశ, ఆమ్లెట్ అడగకండి... ఇదీ... ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు పంపిన ఈమెయిల్ సందేశం. దేశంలో గ్యాస్ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో తమ సంస్థ క్యాంటీన్లలో అందించే ఫుడ్ మెనూలో ఇన్ఫోసిస్ కోతలు పెట్టింది. బెంగళూరు, పుణె, చెన్నై తదితర నగరాల్లోని కార్యాలయాల్లో మార్చి 12 నుంచి కోతలు అమల్లోకి వస్తాయని ఆ సంస్థ వెల్లడించింది. ఎల్‌పీజీ సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఇకపై లైవ్ కుకింగ్ కౌంటర్లు మూసివేస్తున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. దోశ, ఆమ్లెట్ వంటి అధిక మంటపై చేసే వంటకాలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని వెల్లడించింది. ఎల్‌పీజీ సరఫరా సక్రమంగా జరగక ఫుడ్ కోర్టు నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి పరిమితమైన మెనూనే అందుబాటులో ఉంటుందని ఆ సంస్థ వెల్లడించింది. ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయంగా వంటల కోసం విద్యుత్ పరికరాలు, బయోఇంధనాన్ని ఉపయోగించుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించింది. ఉద్యోగులు కూడా భోజనాలు పెట్టే కార్యక్రమాల నిర్వహణకు దూరంగా ఉండాలని, సాధ్యమైనంత వరకూ ఇంటి నుంచే ఆహార పదార్ధాలు తెచ్చుకోవాలని తన ఉద్యోగులను కోరింది.