విమాన ప్రయాణికులపై సర్‌చార్జీ బాదుడు!
ABN , Publish Date - Mar 14 , 2026 | 04:19 AM
పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం విమానయాన రంగాన్నీ తాకింది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విమానఇంధన ధరలకు రెక్కలు రావడంతో విమానయాన సంస్థలు ...
నేటి నుంచి పెరగనున్న ఇండిగో టికెట్ రేట్లు
న్యూఢిల్లీ, మార్చి 13: పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం విమానయాన రంగాన్నీ తాకింది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విమానఇంధన ధరలకు రెక్కలు రావడంతో విమానయాన సంస్థలు ఆభారాన్ని ప్రయాణికులపై మోపేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే టాటా గ్రూప్‌కు చెందిన ఎయిరిండియా టికెట్ ధరపై ఇంధన సర్‌చార్జీ విధిస్తుండగా.. మార్చి 14నుంచి చార్జీలను పెంచాలని నిర్ణయించినట్లు ఇండిగో సంస్థ శుక్రవారం ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై రూ.400 నుంచి రూ.2300 వరకు ఇంధన సర్‌చార్జీలను విధిస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. విమాన సంస్థల నిర్వహణ ఖర్చులో 40ు ఇంధనానికే వెచ్చించాల్సి ఉండడంతో, విమాన ఇంధన ధరల్లో స్వల్పమార్పు వచ్చినా నేరుగా టికెట్ ధరపై ప్రభావం చూపుతోంది. ఎయిరిండియా మార్చి 12 నుంచే సర్‌చార్జీ పేరుతో దేశీయ విమానాలు, సార్క్ దేశాల ప్రయాణాలపై రూ.399చొప్పున అదనంగా వసూలు చేస్తోంది. మార్చి 18నుంచి యూరప్ టికెట్లపై సర్‌చార్జీ 25 డాలర్లు పెరిగి 125 డాలర్ల(సుమారు రూ.10,400)కు, అస్ట్రేలియా-అమెరికా వెళ్లే విమానాలకు 50 డాలర్లు పెరిగి 200 డాలర్ల(రూ.16,600)కు చేరుతుంది.