IndiGo Airlines: విమాన సర్వీసుల్లో సంక్షోభం.. ఇండిగోకు రూ.22 కోట్ల జరిమానా
ABN , Publish Date - Jan 18 , 2026 | 03:27 AM
విమాన సర్వీసులను అనూహ్యంగా రద్దు చేసి సంక్షోభం సృష్టించినందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థకు డీజీసీఏ రూ.22.20 కోట్ల జరిమానా విధించింది.
న్యూఢిల్లీ, జనవరి 17: విమాన సర్వీసులను అనూహ్యంగా రద్దు చేసి సంక్షోభం సృష్టించినందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థకు డీజీసీఏ రూ.22.20 కోట్ల జరిమానా విధించింది. పైలట్ల విధి నిర్వహణ సమయాల్లో మార్పులు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయనందుకు రోజుకు రూ.30 లక్షల వంతున 68 రోజులకు రూ.20.40 కోట్లు, ఏకకాల జరిమానా కింద మరో రూ.1.80 కోట్లు విధించినట్టు వివరించింది. రూ.50 కోట్లకు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని ఆదేశించింది. గత నెల 3-5 తేదీల మధ్య ఏకంగా 2,507 విమాన సర్వీసులను రద్దు చేయగా, 1,852 సర్వీసులు ఆలస్యం కావడంతో అయోమయం నెలకొంది. మూడు లక్షల మంది ప్రయాణికులు అవస్థలు పడ్డారు. దీనిపై దర్యాప్తు చేయించాలని పౌరవిమానయాన శాఖ ఆదేశించడంతో డీజీసీఏ నలుగురు నిపుణులతో కమిటీని నియమించింది. సమగ్రంగా విచారణ జరిపిన ఆ కమిటీ.. నెట్‌వర్క్ ప్లానింగ్‌లో లోపాలు, పైలట్ల రోస్టర్ విధానంలో మార్పులు చేయకపోవడంతోపాటు సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయడంలో వైఫల్యాలు ఉన్నట్టు గుర్తించింది.