Share News

17 వరకూ సౌదీకి ఇండిగో విమానాలు రద్దు

ABN , Publish Date - Oct 14 , 2026 | 06:01 AM

భద్రత కారణాల రీత్యా రియాద్‌ సహా సౌదీ అరేబియాలోని అన్ని పట్టణాలకు ఈ నెల 17 వరకూ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది.

17 వరకూ సౌదీకి   ఇండిగో విమానాలు రద్దు
INDIGO

న్యూఢిల్లీ, అక్టోబరు 13: భద్రత కారణాల రీత్యా రియాద్‌ సహా సౌదీ అరేబియాలోని అన్ని పట్టణాలకు ఈ నెల 17 వరకూ విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. రియాద్‌, జెడ్డా, దమ్మం, మదీనా పట్టణాలకు సర్వీసులు రద్దు చేశామని, ఇప్పటికే టికెట్లు బుక్‌ చేసుకున్న వారు విమానాశ్రయాలకు బయలుదేరే ముందు సంబంధిత విమాన సర్వీసు స్టేటస్‌ కోసం తమ సంస్థ వెబ్‌సైట్‌ను ఒకసారి చెక్‌ చేసుకోవాలని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ‘టికెట్‌ బుక్‌ చేసుకున్నప్పుడు ఇచ్చిన ఫోన్‌ నంబర్లకు ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తాం. ప్రయాణికుల సందేహాలు, ఆందోళనను పరిష్కరించడానికి మా సహాయ సిబ్బంది అందుబాటులో ఉంటారు. మీ భద్రత, మీ బాగోగులు మాకు ప్రాధాన్యం. సురక్షితంగా విమాన సర్వీసుల నిర్వహణకు సంబంధిత అధికార వర్గాలతో సమన్వయం చేసుకుంటాం’ అని ఇండిగో తెలిపింది. సౌదీ రాజధాని రియాద్‌పై యెమెన్‌లోని ఇరాన్‌ అనుకూల హూతిల వైమానిక దాడుల నేపథ్యంలో రియాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేయాలన్న నిర్ణయాన్ని శనివారం వరకూ పొడిగిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే, జెడ్డాలోని కింగ్‌ ఖాలిద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలను సస్పెండ్‌ చేసినట్లు సౌదీ విమానయాన సంస్థ ఓ ప్రకటనలో వెల్లడించింది. రియాద్‌పైకి సోమవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత ఖండాంతర క్షిపణిని ప్రయోగించినట్లు హుతిలు ప్రకటించగా, మధ్యలోనే అడ్డుకుని ధ్వంసం చేశామని సౌదీ అరేబియా ప్రకటించింది.

Updated Date - Oct 14 , 2026 | 06:01 AM