యూరియా ప్లాంట్లు మూత!
ABN , Publish Date - Mar 12 , 2026 | 04:44 AM
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఖతార్ నుంచి ఎల్‌ఎన్‌జీ(ద్రవీకృత సహజవాయువు) సరఫరాకు ఆటంకం కలగడంతో దేశంలోని కొన్ని యూరియా తయారీ ప్లాంట్లు మూతపడ్డాయి...
యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరతే కారణం
న్యూఢిల్లీ, మార్చి 11: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఖతార్ నుంచి ఎల్‌ఎన్‌జీ(ద్రవీకృత సహజవాయువు) సరఫరాకు ఆటంకం కలగడంతో దేశంలోని కొన్ని యూరియా తయారీ ప్లాంట్లు మూతపడ్డాయి. దేశంలోనే అతిపెద్ద యూరియా ఉత్పత్తి సంస్థ అయిన ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కార్పొరేటివ్ లిమిటెడ్ సహా అనేక కంపెనీలు తమ ప్లాంట్లను మూసివేసినవాటిలో ఉన్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. యూరియా ఉత్పత్తికి ఎల్‌ఎన్‌జీనే ప్రధాన వనరు. భారత ఎరువుల రంగం ఎల్‌ఎన్‌జీ దిగుమతులపై భారీగా ఆధారపడింది. ఇందులో అధిక భాగం పశ్చిమాసియా నుంచే వస్తోంది. దే శంలోని ఎరువుల పరిశ్రమలకు అవసరమైన ఎల్‌ఎన్‌జీలో ప్రస్తుతం 70 శాతం మాత్రమే అందుబాటులో ఉంది. దీర్ఘకాలం ఎల్‌ఎన్‌జీ సరఫరా నిలిచిపోతే విదేశాల నుంచి యూరియా కొనుగోళ్లు పెంచాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద యూరియా దిగుమతిదారుగా భారత్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరగనుండటంతో ప్రభుత్వంపై సబ్సిడీ భారం కూడా ఆ మేరకు పెరగనుంది. జూన్‌లో ప్రారంభమయ్యే నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఎరువుల డిమాండ్ తారస్థాయికి చేరనుంది. దేశ ఎరువుల తయారీదారుల ఎల్‌ఎన్‌జీ అవసరాలలో సగటున కనీసం 70 శాతం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని కేంద్ర ఎరువుల మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈనెల 10వ తేదీ నాటికి యూరియా సహా 1.8 కోట్ల టన్నుల ఎరువులు దేశంలో అందుబాటులో ఉన్నాయని, ఇది గతేడాది నిల్వల కంటే 37 శాతం అధికమని పేర్కొన్నారు.