భారత్ వద్ద 190 అణ్వాయుధాలు
ABN , Publish Date - Jun 09 , 2026 | 03:56 AM
భారత దేశ అణుశక్తి సామర్థ్యం పుంజుకుందని స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ(సిప్రి) వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి భారత్ వద్ద 190 వార్‌హెడ్స్ ఉన్నాయని తెలిపింది.
దాయాది దేశం కంటే 20 అధికం: సిప్రి-26 ఇయర్‌బుక్
న్యూఢిల్లీ, జూన్ 8: భారత దేశ అణుశక్తి సామర్థ్యం పుంజుకుందని స్టాక్‌హోమ్ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ(సిప్రి) వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నాటికి భారత్ వద్ద 190 వార్‌హెడ్స్ ఉన్నాయని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న అనిశ్చితి, ఎదురవుతున్న భద్రతా పరమైన సవాళ్ల నేపథ్యంలో భారత ప్రభుత్వం వ్యూహాత్మక నిరోధక శక్తిని పెంపొందించుకుంటోందని సిప్రి తెలిపింది. ఈ మేరకు సిప్రి-2026 ఇయర్ బుక్‌లో వివరించింది.. ఇక, తొమ్మిది అణ్వాయుధ దేశాలు 2025లో తమ శక్తిసామర్థ్యాలను పెంచుకున్నట్టు సిప్రి అంచనా వేసింది. వీటిలో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్థాన్, ఉత్తరకొరియా, ఇజ్రాయెల్ ఉన్నాయని తెలిపింది. భారత్ విషయానికి వస్తే.. గతంలో ఉన్న ఆయుధాల కంటే మరో 10 వార్‌హెడ్స్‌ను పెంచుకున్నట్టు తెలిపింది. 2025లో పాకిస్థాన్ కూడా తన అణ్వాయుధ శక్తిని పెంచుకునే ప్రయత్నం చేసిందని సిప్రి తెలిపింది. ఈ ఏడాది జనవరి నాటికి పాకిస్థాన్ దగ్గర 170 వార్ హెడ్స్ ఉన్నట్టు అంచనా వేసింది. అంటే దాయాది దేశం కంటే కూడా భారత్ దగ్గరే 20 ఆయుధాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది జనవరి వరకు ఉన్న అంచనాల మేరకు ప్రపంచ వ్యాప్తంగా 12,187 అణ్వాయుధాలు ఉన్నాయని సిప్రి ఇయర్ బుక్ తెలిపింది.