ఆందోళన కలిగించే విషయమే..
ABN , Publish Date - Mar 14 , 2026 | 04:24 AM
దేశంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా ఆందోళన చెందాల్సిన అంశంగా మారిందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అంగీకరించింది. ‘‘మన దిగుమతుల్లో ఎక్కువ భాగం హోర్ముజ్ జలసంధి నుంచే వస్తాయి...
ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై కేంద్రప్రభుత్వం
దేశంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా ఆందోళన చెందాల్సిన అంశంగా మారిందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అంగీకరించింది. ‘‘మన దిగుమతుల్లో ఎక్కువ భాగం హోర్ముజ్ జలసంధి నుంచే వస్తాయి. అందుకే ఎల్పీజీ సరఫరా విషయం మాకు ఆందోళన కలిగిస్తోంది’’ అని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ (మార్కెటింగ్ అండ్ ఆయిల్ రిఫైనరీ) అన్నారు. అయితే, ఎల్పీజీ స్టాక్ పూర్తిగా అయిపోయినట్లు దేశవ్యాప్తంగా ఉన్న 25 వేల మంది (గ్యాస్) డిస్ట్రిబ్యూటర్లలో ఎవరి దగ్గర్నుంచీ తమకు నివేదిక ఏదీ రాలేదని ఆమె పేర్కొన్నారు. కొరత భయంతో ప్రజలు గ్యాస్ సిలిండర్లను అవసరం లేకపోయినా బుక్ చేస్తున్నారని ఆమె గణాంకాలతో సహా వివరించారు. ‘‘రోజుకు సగటున 55.7 లక్షల సిలిండర్లు బుక్ అయ్యేవి. కానీ, యుద్ధం మొదలయ్యాక బుకింగ్‌ల సంఖ్య పెరిగింది. మార్చి 12న 75.7 లక్షల బుకింగ్‌లు నమోదయ్యాయి. ఇది ప్యానిక్ బుకింగ్ (ఆందోళనతో చేసే బుకింగ్) తప్ప మరేం కాదు’’ అని ఆమె పేర్కొన్నారు. చమురు సంస్థలు రోజుకు 50 లక్షల సిలిండర్లను సరఫరా చేసేవని.. ఇప్పుడు కూడా అదే సంఖ్యను కొనసాగిస్తున్నాయని తెలిపారు. ఎల్పీజీ కొరత ఉందంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దన్నారు. పైప్‌డ్ నేచురల్ గ్యాస్ అందుబాటులో ఉన్నవారు ఎల్పీజీ నుంచి ఆ గ్యాస్‌కు మారాలని ఆమె సూచించారు. దేశంలో 60 లక్షల కుటుంబాలకు అలా ఎల్పీజీ నుంచి పైప్‌డ్ గ్యాస్‌కు మారే వీలు ఉందని సుజాత శర్మ పేర్కొన్నారు.