Share News

సముద్రంలో విమానాశ్రయం

ABN , Publish Date - Jun 30 , 2026 | 04:26 AM

దేశంలోనే తొలి సముద్ర విమానాశ్రయం (ఆఫ్‌షోర్‌ ఎయిర్‌పోర్ట్‌) నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. మహారాష్ట్రలోని పాల్ఘాట్‌ జిల్లా ...

సముద్రంలో విమానాశ్రయం

  • దేశంలోనే తొలిసారిగా నిర్మాణానికి కసరత్తు

  • మహారాష్ట్రలోని కోరే బీచ్‌లో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు

  • అంచనా వ్యయం రూ.45 వేల కోట్లు

ముంబై, జూన్‌ 29: దేశంలోనే తొలి సముద్ర విమానాశ్రయం (ఆఫ్‌షోర్‌ ఎయిర్‌పోర్ట్‌) నిర్మాణం దిశగా అడుగులు పడుతున్నాయి. మహారాష్ట్రలోని పాల్ఘాట్‌ జిల్లా కోరే బీచ్‌ దీనికి వేదిక కానుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) సమర్పించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ తాజాగా అధికారులను ఆదేశించారు. సముద్ర విమానాశ్రయం అంటే.. సముద్రంలో ఉండే విమానాశ్రయమే. లోతు తక్కువ ఉన్న ప్రాంతాన్ని మట్టితో పూడ్చి దానిపైన ఎయిర్‌పోర్టును నిర్మిస్తారు. పరిమిత భూభాగం ఉన్న వాణిజ్య కేంద్రాల్లో పెరుగుతున్న రాకపోకలను, అవసరాలను తీర్చటానికి ఈ తరహా విమానాశ్రయాలను నిర్మిస్తుంటారు. జపాన్‌, హాంగ్‌కాంగ్‌, దక్షిణ కొరియాల్లో ఇప్పటికే ఆఫ్‌షోర్‌ ఎయుర్‌పోర్టులు ఉన్నాయి. మూడు వైపులా సముద్రం ఉండే ముంబై మహానగరంలోనూ భూభాగం చాలా పరిమితం అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశంలో తొలి సముద్ర విమానాశ్రయాన్ని.. ముంబైకి ఉత్తరాన 120 కి.మీ.ల దూరంలో ఉండే కోరే బీచ్‌లో నిర్మించాలన్న ప్రతిపాదన ముందుకొచ్చింది. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.45 వేల కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంట్లో సముద్రాన్ని పూడ్చి కొత్త భూభాగాన్ని నిర్మించటానికే రూ.25 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. మిగిలిన రూ.20 వేల కోట్లతో ఎయిర్‌పోర్టు మౌలిక సదుపాయాలు, టర్నినళ్లు, రన్‌వేలు మొదలైనవి నిర్మిస్తారు.

ఎయిర్‌కార్గో హబ్‌గానూ సేవలు

ఏటా 9 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సామర్థ్యంతో ఈ ఎయిర్‌పోర్టును నిర్మించాలన్న అంచనాలున్నాయి. అలాగే, దీన్ని ఒక ప్రధానమైన ఎయిర్‌కార్గో హబ్‌గా రూపొందించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఏటా 30 లక్షల మెట్రిక్‌ టన్నుల సరుకు రవాణాను (కార్గో) నిర్వహించగల సదుపాయాలు కల్పించాలన్న ప్రణాళికలున్నాయి. ఈ మేరకు పాల్‌ఘాట్‌ జిల్లాలోనే 29.8 కోట్ల మెట్రిక్‌ టన్నుల వార్షిక కార్గో సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన వధావన్‌ పోర్టుతో ఈ విమానాశ్రయం అనుసంధానం కానుంది. అంతేకాదు, వడోదర-ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే, ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌ వే, ముంబై-అహ్మదాబాద్‌ హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌, మెట్రోరైల్వేతో ఈ ఆఫ్‌షోర్‌ ఎయిర్‌పోర్టును అనుసంధానించనున్నారు. దేశంలోనే తొలి సముద్ర విమానాశ్రయ నిర్మాణం పూర్తయితే మహారాష్ట్ర రూపురేఖలు మారే అవకాశం ఉందని, ముంబై అభివృద్ధి మరో స్థాయికి వెళ్తుందని ఆర్థికరంగ నిపుణులు భావిస్తున్నారు.

Updated Date - Jun 30 , 2026 | 04:26 AM