భారత్-అమెరికా ఒప్పందం..చైనాకు ‘చమురు’ లాభం!
ABN , Publish Date - Feb 07 , 2026 | 03:53 AM
అమెరికా చెబుతున్నట్టుగానే రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు భారీగా తగ్గిపోతున్నాయి. 2024 డిసెంబరుతో పోలిస్తే.. గత ఏడాది డిసెంబరులో దిగుమతులు 27.5శాతం తగ్గిపోయాయి.
ఒక్కో బ్యారెల్‌కు 12 డాలర్ల డిస్కౌంట్
న్యూఢిల్లీ/మాస్కో, ఫిబ్రవరి 6: అమెరికా చెబుతున్నట్టుగానే రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు భారీగా తగ్గిపోతున్నాయి. 2024 డిసెంబరుతో పోలిస్తే.. గత ఏడాది డిసెంబరులో దిగుమతులు 27.5శాతం తగ్గిపోయాయి. దీనితో రష్యా చమురు అమ్ముకోవడానికి చైనాపై ఫోకస్ చేసింది. ఏకంగా బ్యారెల్‌కు 12 డాలర్ల డిస్కౌంట్ ఆఫర్ చేసింది. మొత్తానికి భారత్-అమెరికా ఒప్పందం షరతుల నుంచి లాభం చైనా ప్రయోజనం పొందుతోంది. గత ఏడాది ఆగస్టులో భారత్‌పై సుంకాలను 50శాతానికి పెంచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. రష్యా చమురు కొనుగోళ్లు నిలిపివేస్తే సుంకాలు తగ్గిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందంపై ప్రకటన చేసిన సందర్భంగా రష్యా నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని ప్రధాని మోదీ మాటిచ్చారని పేర్కొన్నారు. ట్రంప్ చెప్పినట్టుగా భారత్ ఇప్పటికే రష్యా చమురు కొనుగోళ్లను బాగా తగ్గించేసినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. భారత మొత్తం చమురు కొనుగోళ్లలో రష్యా చమురు వాటా గత ఏడాది ఫిబ్రవరిలో 34శాతంగా ఉంటే.. డిసెంబరులో 24శాతానికి తగ్గిపోయింది. జనవరిలో కొనుగోళ్లు ఇంకా తక్కువగా ఉంటాయని, తుది గణాంకాలు రావాల్సి ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో అమెరికా నుంచి చమురు కొనుగోళ్లు 2024 డిసెంబరుతో పోలిస్తే గత డిసెంబరులో 58శాతం పెరిగినట్టు వెల్లడించాయి. దీంతో, రష్యా చైనా వైపు ఫోకస్ చేసింది. రష్యా మొత్తం చమురులో చైనా ఇప్పటికే 47శాతం కొంటోంది.