Share News

పడమటి పరిణయ రాగం

ABN , Publish Date - Mar 20 , 2026 | 05:23 AM

ప్రతి సంక్షోభం ఒక కొత్త అవకాశానికి దారి తీస్తుంది! ఇది చరిత్ర చెప్పే సత్యం!! అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన ట్రంప్‌ అనే పెను సంక్షోభం.. ఆ దేశంలో స్థిరపడ్డ మనోళ్ల ఆలోచన ధోరణిని మార్చడమే కాక....

పడమటి పరిణయ రాగం

అమెరికాలో మోగుతున్న భారతీయ పెళ్లి బాజాలు

ట్రంప్‌ వలస విధానాల దెబ్బతో వివాహం కోసం భారత్‌కు వెళ్లేందుకు భయపడుతున్న ఎన్నారైలు

ఇండియాకి వెళ్లి రావడానికి అయ్యే ఖర్చులతోనే పరిమిత హంగులతో యూఎస్‌ గడ్డపైవివాహాలు

ఫంక్షన్‌హాల్‌ వ్యాపారంలోకీ మనోళ్ల ప్రవేశం

రాంచ్‌హౌస్‌లను కొని పెళ్లి వేదికలుగా అద్దెకు..

పురోహితులు, ఫొటోగ్రాఫర్లకు పెరిగిన గిరాకీ

వేదిక, క్యాటరింగ్‌, మేకప్‌ వారికి కూడా..

ప్రతి సంక్షోభం ఒక కొత్త అవకాశానికి దారి తీస్తుంది! ఇది చరిత్ర చెప్పే సత్యం!! అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన ట్రంప్‌ అనే పెను సంక్షోభం.. ఆ దేశంలో స్థిరపడ్డ మనోళ్ల ఆలోచన ధోరణిని మార్చడమే కాక, కొత్త ఉపాధి అవకాశాలకు దారులు తెరవడం ఇందుకు తాజా ఉదాహరణ. ఉద్యోగరీత్యా అమెరికాలో ఉండే భారతీయులు ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలంటే.. ఇండియాకు వెళ్లి అక్కడే బంధుమిత్రుల సందడి నడుమ ఆ తంతు ముగించుకుని తిరిగొచ్చేవారు. కానీ.. ట్రంప్‌ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారిపోయాయి. స్వదేశానికి వెళ్లి అక్కడ అయిన వాళ్లందరి నడుమ ఆర్భాటంగా పెళ్లి చేసుకోవాలనే కలలు ఎన్ని ఉన్నప్పటికీ.. వాటికి కత్తెర వేసుకోవాల్సి వస్తోంది. ట్రంప్‌ సర్కారు అనుసరిస్తున్న విధానాలే ఇందుకు కారణం. పెళ్లి కోసం స్వదేశానికి వెళితే.. వీసా స్టాం పింగ్‌కు స్లాట్లు దొరకని పరిస్థితి! స్లాట్లు దొరికి, తిరిగి రావడం ఎప్పటికి కుదురుతుందో? అసలు రాగలమో లేదో? వచ్చి నా అప్పటిదాకా ఉద్యోగం ఉంటుందో? ఊడుతుందో? అనే భయంతో చాలా మంది ఇప్పుడు యూఎ్‌సఏలోనే పరిమితమైన హంగులతో పెళ్లి తంతు ముగించేస్తున్నారు. జీవితభాగస్వామిని ఎంచుకునే ప్రక్రియకూడా అందుకు అనుగుణంగానే సాగుతోంది. గతంలోలాగా ఇండియాలో సంబంధాలను వెతుక్కు నే బదులు.. ఇప్పుడు యూఎ్‌సలో ఉంటున్న వారికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. అలా కాదని ఎవరైనా ఇండియాకి వెళ్లి, పెళ్లిచేసుకుని వద్దామనుకుంటే.. వీసా స్టాంపింగ్‌ స్లాట్లు 2027దాకా లభించని పరిస్థితి. వెళ్తే, అప్పటిదాకా స్వదేశంలో గడపడం తప్ప గత్యంతరం ఉండదు. ఇప్పుడున్న వాతావరణంలో రెండు వారాలకు మించి సెలవు పెడితే ఉద్యోగమే పోయే పరిస్థితి. కొన్ని కంపెనీలు పెళ్లికి మూడు నెలల సెలవు ఇస్తున్నప్పటికీ వీసా స్లాట్‌ల భయంతో చాలామంది అసలు ఆ ఆలోచనే చేయట్లేదు. ఫలితంగా అమెరికాలో భారతీయ పెళ్లి బాజా లు మోగడం బాగా పెరిగింది. పెళ్లి చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుండడం భారతీయ కుటుంబాలకు లాభసాటిగా కూడా మారుతోంది. ఇండియాలో పెళ్లి ఆర్భాటాలకు పెట్టే ఖర్చులో సగం కన్నా తక్కువలోనే అమెరికాలో పెళ్లి అయిపోతున్నదని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ఫంక్షన్‌హాళ్ల వ్యాపారంలోకి..

సంక్షోభాలను వ్యాపార అవకాశాలుగా మార్చుకోవడంలో తెలుగువాళ్లకి పోటీ వచ్చేవారే లేరు! అమెరికాలో ఇప్పుడు అదే జరుగుతోంది. యూఎస్లో భారతీయ వివాహాల సంఖ్య పెరుగుతుండడంతో అనేక నగరాల్లో.. ప్రధానంగా తెలుగువారి ప్రాబల్యం అధికంగా ఉండే నగరాల్లో మనోళ్లు బాంక్వెట్‌ హాల్స్‌, కన్వెన్షన్‌ హాల్స్‌ నిర్వహణ వ్యాపారంలోకి పెద్ద ఎత్తున దిగారు. అమెరికాలో రాంచ్‌హౌస్‌ల పేరుతో.. పొలాల మధ్యలో కట్టుకున్న విశాలమైన ఇళ్లు ఉంటాయి. వాటిని భారత్‌లోని ఫామ్‌హౌస్‌లతో పోల్చవచ్చు. అలాంటి రాంచ్‌హౌస్‌లను కొందరు తెలుగువారు కొనుగోలు చేసి.. వాటిని పెళ్లి వేదికలుగా తీర్చిదిద్దుతున్నారు. నగర జీవితాల కు అలవాటుపడిన వారికి భిన్నమైన వాతావరణం, డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకున్న అనుభూతిని ఆ రాంచ్‌హౌస్‌లు ఇస్తున్నాయి. కరోనా అనంతర పరిస్థితులో రియల్‌ఎస్టేట్‌ బూమ్‌ పెరగడంతో చాలామందితెలుగువారు ఆ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఆ క్రమంలోనే పలువురు ఇలాంటి రాంచ్‌హౌస్‌లను కూడా కొనుగోలు చేశారు. అవన్నీ ఇప్పుడు పెళ్లి వేదికలుగా అక్కరకు వస్తున్నాయి. వాటిలో 30-40వేల డాలర్లలో వేడుక అంతా పూర్తయిపోతోంది. ఎన్నారైలకు ఇది చాలా అందుబాటులో ఉండడంతో ఎక్కువ మంది ఇదే బాటను ఆశ్రయిస్తున్నారు. మరి భారత్‌లో ఉన్న బంధువుల మాట ఏమిటి? వారు పెళ్లి వేడుకలను చూసేదెలా? అంటే.. ఇంటర్‌నెట్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసి, ఆ లోటు లేకుండా చూసుకుంటున్నారు.

సంప్రదాయానికి లోటు లేదు..

పెళ్లి అమెరికాలో, పరిమితమైన హంగులతో జరుగుతోందనే తప్ప.. సంప్రదాయాలకు మాత్రం ఎలాంటి లోటూ జరగట్లేదు. ఎందుకంటే.. అమెరికా లో పురోహితులు కూడా పుష్కలంగా ఉన్నారు. కించిత్‌ తేడా లేకుండా వివాహ తంతు మొత్తాన్నీ భారత్‌లో చేసినట్టే జరిపిస్తున్నారు. పెళ్లిళ్లు జోరుతో పురోహితులకు కూడా గిరాకీ బాగా పెరుగుతోంది. వివాహ ఫొటోగ్రఫీ ఒక అనుబంధ వ్యాపారంగా విస్తరిస్తోంది. కొంతమంది.. ఇండియా నుంచి ప్రత్యేకంగా ఫొటోగ్రాఫర్లను పిలిపించుకుంటుండగా, మ రికొందరు స్థానికంగా ఉన్నవారితోనే ఫొటోలు తీయించుకుంటున్నారు. ఫొటోగ్రఫీ హాబీఉన్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు తక్కువ ధరల్లోనే సేవలందిస్తున్నా రు. ఇలా యూఎస్లో మనోళ్ల పెళ్లిళ్లు.. యువతరాని కి అదనపు ఆదాయ వనరుగానూ మారుతున్నాయి.

- కృష్ణమోహన్‌ దాసరి, డాలస్‌

అనుబంధ రంగాల విస్తరణ..

వివాహ వ్యాపారంలోని అనుబంధ రంగాలు కూడా అమెరికాలో విస్తరిస్తున్నాయి. వేదికల డెకరేషన్‌, మేకప్‌ వంటివి భారతీయ, తెలుగు మహిళలకు కొత్త ఉపాధి అవకాశాలుగా మారాయి. ఇప్పటికే హోటళ్లు, ఆతిథ్య రంగంలో అమెరికాలోని తెలుగువారి ముద్ర స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఇప్పుడు పెళ్లిళ్ల కేటరింగ్‌ కూడా ఒక ప్రధాన వ్యాపారంగా మారింది.

Updated Date - Mar 20 , 2026 | 05:23 AM