Share News

భారత్‌ను అరాచకత్వం నుంచి కాపాడండి

ABN , Publish Date - Oct 20 , 2026 | 05:42 AM

భారత ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు జరుపుతోన్న నిరసనలను 27 దేశాల్లోని పలు విశ్వవిద్యాలయాలకు చెందిన 400 మంది విద్యార్థులు, పరిశోధకులు, మాజీ విద్యార్థులు ఖండించారు.

భారత్‌ను అరాచకత్వం నుంచి కాపాడండి

  • భారత సంతతి విద్యార్థులు, పరిశోధకుల పిలుపు

  • సీఈసీ వ్యతిరేక నిరసనలకు ఖండన

న్యూఢిల్లీ, అక్టోబరు 19 : భారత ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు జరుపుతోన్న నిరసనలను 27 దేశాల్లోని పలు విశ్వవిద్యాలయాలకు చెందిన 400 మంది విద్యార్థులు, పరిశోధకులు, మాజీ విద్యార్థులు ఖండించారు. ఈ నిరసనలు భారతరాజ్యాంగ సంస్థలు, ప్రజాస్వామ్య ప్రక్రియలకు విశ్వసనీయత లేకుండా చేసే ప్రయత్నమేనని పేర్కొన్నారు. ‘భారత్‌ను అరాచకత్వం నుంచి కాపాడండి’ అని పేరు పెట్టిన ఒక సంయుక్త ప్రకటనపై సంతకం చేసిన వీరంతా.. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలను నాశనం చేసేందుకే కొందరు వీధుల్లోకి వచ్చి అరాచకంగా నిరసన ప్రదర్శనలు జరుపుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామనే నెపంతో కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందుకు కోర్టుల పరిధిలో ఉన్న అంశాలను ఆయుధాలుగా చేసుకొని దేశ ప్రజాస్వామ్యంపై విష బీజాలు నాటుతున్నారని ఆరోపించారు. ఆపై ప్రజాస్వామిక పాలనపై ఎప్పుడూ నమ్మకం లేని అరాచక శక్తులు వీధుల్లోకి వచ్చి అల్లరి చేస్తున్నాయని విమర్శించారు. అదీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నామనే నెపంతో చేయడం విచిత్రమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. భారతీయులుగా ఈ పరిస్థితులపై తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నామని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన అనంతరం గత ఏడు దశాబ్దాల్లో భారత ప్రజాస్వామ్యం తన బలాన్ని అనేక సార్లు నిరూపించుకుందని, ఆయా రాజ్యాంగ సంస్థలు తమ బాధ్యతలను ఎంతో మెరుగ్గా నెరవేర్చుతూనే ఉన్నాయని వివరించారు. దేశంలో ఎప్పుడూ శాంతియుతంగా అధికార మార్పిడి జరగడమే దీనికి స్పష్టమైన నిదర్శనమని(హాల్‌మార్క్‌) ఆ ప్రకటనలో తెలిపారు.

Updated Date - Oct 20 , 2026 | 05:44 AM