మరింత సులభంగా రైలు టికెట్!
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:04 AM
నాలుగు దశాబ్దాల తర్వాత రైల్వే రిజర్వేషన్ వ్యవస్థను సమూలంగా అప్‌గ్రేడ్ చేసేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఆగస్టు నుంచి టికెట్ల రిజర్వేషన్ నూతన పీఆర్‌ఎస్....
టికెట్ బుకింగ్ విధానం వేగవంతం
ఆగస్టు నుంచి నూతన రిజర్వేషన్ వ్యవస్థ
న్యూఢిల్లీ, జూన్ 8: నాలుగు దశాబ్దాల తర్వాత రైల్వే రిజర్వేషన్ వ్యవస్థను సమూలంగా అప్‌గ్రేడ్ చేసేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. ఈ ఏడాది ఆగస్టు నుంచి టికెట్ల రిజర్వేషన్ నూతన పీఆర్‌ఎస్(ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థ)లోకి మారనుంది. తద్వారా టికెట్ బుకింగ్ వేగవంతం, సులభతరం అవుతుందని రైల్వేశాఖ భావిస్తోంది. టికెట్ బుకింగ్ వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ప్రయాణికులకు మెరుగైన అనుభూతిని అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్టు తెలిపింది. దీని పురోగతిని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీలోని రైల్‌భవన్‌లో సమీక్షించారు. నూతన వ్యవస్థలోకి మారే సందర్భంలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న రిజర్వేషన్ వ్యవస్థను 1986లో ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి స్వల్ప మార్పులు మినహా సమూలంగా అప్‌గ్రేడ్ చేయలేదు. 2002లో ఇంటర్నెట్ ఆధారిత టికెట్ బుకింగ్‌ను తీసుకొచ్చారు. దీంతో రిజర్వేషన్ కౌంటర్ల వద్దకు రావడం కంటే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకునేందుకే ఎక్కువమంది ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం 88 శాతం టికెట్ల బుకింగ్ ఆన్‌లైన్ ద్వారానే జరుగుతోంది. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌కు పెరుగుతున్న డిమాండ్ మేరకు అత్యధిక సామర్థ్యం ఉండేలా అధునాతన సాంకేతికతను ఉపయోగించి నూతన రిజర్వేషన్ వ్యవస్థను రూపొందిస్తున్నారు. గతేడాది జూలైలో ప్రారంభించిన రైల్‌వన్ యాప్‌ను 3.5కోట్ల మందికిపైగా డౌన్‌లోడ్ చేసుకోగా.. ప్రతిరోజూ 9.29లక్షల టికెట్లు బుక్ అవుతున్నాయని రైల్వేశాఖ తెలిపింది. అలాగే, వెయిటింగ్ లిస్ట్ టికెట్ కన్ఫర్మేషన్ అయ్యే అవకాశాన్ని ఏఐ ద్వారా అంచనా వేసే సదుపాయాన్ని ఈఏడాది అందుబాటులోకి తెచ్చారు. దీని కచ్చితత్వం 53నుంచి 94 శాతానికి పెరిగింది.