Share News

భారతీయుల తరలింపు అవసరం లేదు

ABN , Publish Date - Mar 03 , 2026 | 04:22 AM

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దుబాయితో సహా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో ఉంటున్న ప్రవాస భారతీయుల తరలింపు అవసరం ఏమీలేదని యూఏఈలోని భారతీయ రాయబారి దీపక్‌ మిట్టల్‌ స్పష్టం చేశారు.

భారతీయుల తరలింపు అవసరం లేదు

  • పర్యాటకులు తిరిగి వెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి

  • విమానాలను పునరుద్ధరించిన వెంటనే వీరి తరలింపు

  • యూఏఈలో భారతీయ రాయబారి దీపక్‌ మిట్టల్‌

ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దుబాయితో సహా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో ఉంటున్న ప్రవాస భారతీయుల తరలింపు అవసరం ఏమీలేదని యూఏఈలోని భారతీయ రాయబారి దీపక్‌ మిట్టల్‌ స్పష్టం చేశారు. ప్రస్తుతం విమానాల రద్దు వల్ల చిక్కుకుపోయిన పర్యాటకులు దుబాయి, ఇతర ఎమిరేట్ల నుంచి వీలైనంత త్వరగా తిరిగి వెళ్లడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, విమానాలను పునరుద్ధరించిన వెంటనే వీరి తరలింపు ఉంటుందని ఆయన తెలిపారు. సోమవారం ఉదయం దుబాయిలోని భారతీయ కాన్సుల్‌ జనరల్‌ సతీష్‌ కుమార్‌ శివన్‌తో కలిసి ఆయన ప్రవాసీ ప్రముఖులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. విమానాల రద్దు వల్ల చిక్కుకుపోయిన పర్యాటకుల వీసా గడువు ముగింపు ఆంక్ష ఏమిలేదని తెలిపారు. వీరిని వీసా గడువు ముగిసినా ఉల్లంఘన కింద పరిగణించబోమని యూఏఈ అధికారులు తమకు వివరించారని రాయబారి చెప్పారు. హోటళ్లు ఈ పర్యాటకుల నుంచి మొదట బుకింగ్‌ చేసిన ధరలకే గదులు, భోజన, ఇతర సేవలను ఇక ముందు కొనసాగించాలని కూడా దుబాయి ప్రభుత్వం షరతు విధించిందని దీపక్‌ మిట్టల్‌ తెలిపారు. అబుధాబి ఎమిరేట్‌లో పర్యాటకుల హోటల్‌ గదులు, భోజనం ఖర్చులను కూడా అబుధాబి ఎమిరేట్‌ ప్రభుత్వం భరిస్తుందని రాయబారి తెలిపారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒమాన్‌ లేదా ఇతర దేశాలకు రోడ్డు మార్గం గుండా వెళ్లి అక్కడి నుంచి భారతదేశానికి వెళ్లడం శ్రేయస్కరంకాదన్నారు. ప్రభుత్వ వర్గాల నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని దౌత్యవేత్తలు కోరారు. కాగా, రేటింగ్‌ కోసం భారత మీడియా సంస్థలు వాస్తవ విరుద్ధ, సంచలనాత్మక కథనాలు ప్రసారం చేస్తున్నాయని దౌత్యవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - Mar 03 , 2026 | 04:22 AM