Share News

ఒమన్‌ తీరంలో డ్రోన్‌ దాడి.. భారత కార్గో నౌక మునక

ABN , Publish Date - May 15 , 2026 | 04:10 AM

పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఒమన్‌ తీరంలో డ్రోన్‌ దాడి కారణంగా భారత సరుకు రవాణా నౌక మునిగిపోయింది.

ఒమన్‌ తీరంలో డ్రోన్‌ దాడి.. భారత కార్గో నౌక మునక

  • సోమాలియా నుంచి షార్జాకు పశువుల్ని తరలిస్తుండగా ఘటన.. 14 మంది సిబ్బంది సురక్షితం

  • నౌకపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్‌

అహ్మదాబాద్‌/న్యూఢిల్లీ/దుబాయ్‌, మే 14: పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో ఒమన్‌ తీరంలో డ్రోన్‌ దాడి కారణంగా భారత సరుకు రవాణా నౌక మునిగిపోయింది. నౌకలోని 14 మంది భారత సిబ్బందిని ఒమన్‌ తీర రక్షక దళాలు కాపాడాయి. బుధవారం తెల్లవారు జామున గుజరాత్‌కు చెందిన హాజీ అలీ అనే నౌక సోమాలియా నుంచి షార్జాకు పశువులను తరలిస్తుండగా డ్రోన్‌ లేదా క్షిపణిగా అనుమానిస్తున్న పేలుడు వస్తువు ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి నౌక అదుపు తప్పి సముద్రంలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే లైఫ్‌బోట్ల సాయంతో నౌకలోని సిబ్బంది సముద్రంలో దిగగా.. వారిని ఒమన్‌ కోస్ట్‌ గార్డ్‌ దళాలు రక్షించి తీరానికి తరలించాయి. అయితే ఈ దాడి ఎవరు చేశారన్నది తెలియరాలేదు. భారత విదేశాంగ శాఖ ఈ దాడిని తీవ్రంగా ఖండించింది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. నౌకలోని భారత సిబ్బంది క్షేమంగా ఉన్నారని.. వారిని కాపాడిన ఒమన్‌ కోస్ట్‌ గార్డ్‌ అధికారులకు ధన్యవాదాలు తెలిపింది. కాగా, యూఏఈ తూర్పు తీరంలో లంగర్‌ వేసి ఉన్న ఓ నౌకను గుర్తు తెలియని సాయుధ వ్యక్తులు స్వాధీనం చేసుకుని ఇరాన్‌ ప్రాదేశిక జలాల వైపు మళ్లించినట్లు యూకే మారిటైమ్‌ టేడ్ర్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌ వెల్లడించింది. హోర్ముజ్‌కు సమీపంలోనే ఇది జరిగినట్లు తెలుస్తోంది.

హోర్ముజ్‌ను దాటిన 2 భారత ఎల్పీజీ ట్యాంకర్లు..

ఇటు ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాఘ్చీ ఢిల్లీలో బ్రిక్స్‌ విదేశాంగ మంత్రుల సమావేశానికి చేరుకున్న సమయంలోనే రెండు భారత భారీ ఎల్పీజీ ట్యాంకర్లు హోర్ముజ్‌ జలసంధిని గురువారం సురక్షితంగా దాటాయి. సిమీ (మార్షల్‌ దీవుల జెండాతో), ఎన్వీ సన్‌షైన్‌ (వియత్నాం జెండాతో) అనే రెండు ఎల్పీజీ నౌకలు ఖతార్‌, యూఏఈ నుంచి ఎల్పీజీని తీసుకొస్తున్నాయి. ఈ నౌకలు తర్వలోనే గుజరాత్‌లోని కాండ్లా ఓడరేవుకు చేరుకోనున్నట్లు సమాచారం.

Updated Date - May 15 , 2026 | 04:10 AM