Indian Army: లక్ష మంది డ్రోన్ సైనికులతో భైరవ దళం
ABN , Publish Date - Jan 05 , 2026 | 02:28 AM
మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా భారత సైన్యం కూడా టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతోంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సరికొత్త అస్త్రాలతో ఆధునిక యుద్ధ దళాన్ని సిద్ధం చేస్తోంది...
ఆధునిక యుద్ధ దళాన్ని సిద్ధం చేసిన సైన్యం
15న ఆర్మీ డే పరేడ్‌లో ప్రత్యేక దళం కవాతు
నసీరాబాద్ (రాజస్థాన్), జనవరి 4: మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా భారత సైన్యం కూడా టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతోంది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సరికొత్త అస్త్రాలతో ఆధునిక యుద్ధ దళాన్ని సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో సైన్యంలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా లక్షమందికిపైగా డ్రోన్ ఆపరేటర్లతో ఒక భారీ సైన్యాన్ని తయారు చేసింది. శత్రు స్థావరాలను ధ్వంసం చేసేందుకు ‘భైరవ్’ పేరుతో స్పెషల్ ఫోర్స్‌ను సిద్ధం చేసింది. రాజస్థాన్ ఎడారి ప్రాంతంలో కొత్తగా ఈ భైరవ్ బెటాలియన్లను ఏర్పాటు చేశారు. ఆధునిక యుద్ధ రంగంలో డ్రోన్ల వినియోగం పెరిగిన నేపథ్యంలో.. ‘భైరవ్’ ఏర్పాటు వెనుక భారీ వ్యూహం ఉంది. ఇది సాధారణ దళానికి, పారా స్పెషల్ ఫోర్సె్‌సకి మధ్య వారధిలా పనిచేస్తుంది. బహుళ స్థాయిల్లో అత్యంత వేగంగా, దూకుడుగా దాడి చేయడం ‘భైరవ దళం’ ప్రత్యేకత. ఈ దళంలోని ప్రతి సైనికుడికి డ్రోన్లు ఆపరేటింగ్, యుద్ధంలో వాటి వినియోగంపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. భారత సైన్యం ఇప్పటికే 15 బెటాలియన్లను ఏర్పాటుచేసింది. వాటిని పాక్, చైనా సరిహద్దుల్లోని వివిధ దళాలకు కేటాయించింది. భవిష్యత్తులో వీటిని 25 బెటాలియన్లకు పెంచాలనేది ఆర్మీ లక్ష్యం.
రాజస్థాన్‌లో కఠోర శిక్షణ
ప్రస్తుతం రాజస్థాన్‌లో ఈ దళం 5నెలలుగా కఠోర శిక్షణ తీసుకుంటోంది. రాజస్థాన్ ఎడారి ప్రాంతం, అక్కడి వాతావరణం, భాష, భౌగోళిక పరిస్థితులపై పూర్తిగా అవగాహన ఉన్న స్థానిక యువకులనే ఈ బెటాలియన్‌లో ఎక్కువగా చేర్చుకున్నారు. ఈ ఏడాది జనవరి 15న జైపూర్‌లో జరగనున్న ఆర్మీ డే పరేడ్‌లో భైరవ దళం తొలిసారిగా కవాతు చేయనుంది. భైరవ్ మాత్రమే కాదు.. ‘రుద్ర బ్రిగేడ్స్’ పేరుతో మరో శక్తిమంతమైన వ్యవస్థను కూడా భారత ఆర్మీ ఏర్పాటు చేసింది. ఇందులో పదాతిదళం, యాంత్రిక యూనిట్లు, ట్యాంకులు, ఫిరంగి దళం, ప్రత్యేక దళాలు, డ్రోన్ వ్యవస్థలన్నీ ఉంటాయి. ఇదొక సంపూర్ణ యుద్ధ వ్యవస్థ.