సైన్యం యూనిఫాం రూల్స్‌కు సవరణ
ABN , Publish Date - Jun 15 , 2026 | 03:31 AM
భారత సైన్యం తమ అధికార దుస్తుల నిబంధనల్లో వలసవాద(బ్రిటీష్) కాలం నాటి పలు పద్ధతులను తొలగిస్తూ సమగ్ర మార్పులు చేపట్టింది.
న్యూఢిల్లీ, జూన్ 14: భారత సైన్యం తమ అధికార దుస్తుల నిబంధనల్లో వలసవాద(బ్రిటీష్) కాలం నాటి పలు పద్ధతులను తొలగిస్తూ సమగ్ర మార్పులు చేపట్టింది. యూనిఫాంలో భారత జాతీయ గుర్తింపు మరింత ప్రతిబింబించేలా నిబంధనలను ప్రవేశపెట్టింది. సుమారు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ‘ఆర్మీ యూనిఫార్మ్స్-2026’ పేరుతో రూపొందించిన 174 పేజీల మాన్యువల్‌లో తాజా మార్పులను చేర్చారు. దీని ప్రకారం.. సైన్యంలోని అధికారులు ఇకపై ఫార్మల్ డ్రెస్ కోడ్‌లో భాగంగా మెడ వరకు మూసివుండే బందీ జాకెట్లను ధరించవచ్చు. పరేడ్ల సమయంలో ఆర్మీ సమీక్షా అధికారులు తమ చేతుల్లో బ్రిటీష్ కాలం నాటి ఖడ్గాలను పట్టుకొని నడిచే పాత పద్ధతికి స్వస్తి పలికారు. అలాగే చలికాలంలో సైనికుల రక్షణ కోసం అన్ని ర్యాంకుల వారికి ‘డ్రెస్ 3బీ’ పేరుతో ప్రత్యేకంగా కొత్త డ్రెస్‌ను ఆర్మీ ప్రవేశపెట్టింది.