సైన్యానికీ సొంత సమాచార ఉపగ్రహం
ABN , Publish Date - Oct 20 , 2026 | 05:39 AM
మారుమూల సరిహద్దు ప్రాంతాల్లోనూ మన సైనికులకు నిరంతర సమాచార వ్యవస్థ అందుబాటులోకి రానుంది. భారత ఆర్మీ కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న తొలి కమ్యూనికేషన్ ఉపగ్రహం..
2028లో ‘జీశాట్-7బీ’ ప్రయోగం
మారుమూల ప్రాంతాల్లోనూ నిరంతర సమాచారం
యుద్ధం, సరిహద్దు ఉద్రిక్తతల వేళ ఉపయుక్తం
న్యూఢిల్లీ, అక్టోబరు 19: మారుమూల సరిహద్దు ప్రాంతాల్లోనూ మన సైనికులకు నిరంతర సమాచార వ్యవస్థ అందుబాటులోకి రానుంది. భారత ఆర్మీ కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న తొలి కమ్యూనికేషన్ ఉపగ్రహం ‘జీశాట్-7బీ’ త్వరలోనే అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 2028 మధ్య నాటికి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఇది అందుబాటులోకి వస్తే మారుమూల సరిహద్దు ప్రాంతాలు, అత్యంత క్లిష్టమైన భూభాగాలు, పర్వత ప్రాంతాల్లోనూ సైనికులకు అత్యంత సురక్షితమైన, నిరంతర సమాచారాన్ని అందించవచ్చని ఉన్నతాధికారులు సోమవారం తెలిపారు. వైమానిక దళం, నౌకాదళంలా భారత సైన్యానికి ప్రత్యేకంగా కమ్యూనికేషన్ శాటిలైట్ లేదు. ప్రస్తుతం సైన్యం తన కమ్యూనికేషన్ అవసరాల కోసం వాయుసేనకు చెందిన జీశాట్-7ఏపైనే ఆధారపడుతోంది. జీశాట్-7బీ అందుబాటులోకి వస్తే ఆర్మీకి పూర్తిగా సొంత నెట్‌వర్క్ లభిస్తుంది. 2023 మార్చిలో రక్షణ మంత్రిత్వశాఖ ఈ ప్రాజెక్టు కోసం ఇస్రో వాణిజ్య విభాగమైన ‘న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్’(ఎన్‌ఎస్ఐఎల్)తో సుమారు రూ.3వేల కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు 5 టన్నుల బరువుండే ఈ జయోస్టేషనరీ ఉపగ్రహం భారత్‌కు చెందిన అత్యంత భారీ కమ్యూనికేషన్ శాటిలైట్లలో ఒకటిగా నిలవనుంది. యుద్ధ సమయాల్లో లేదా సరిహద్దుల వద్ద ఉద్రిక్తతల వేళ బలగాల మధ్య సమర్థవంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇది దోహదపడుతుంది.
వాయుసేనకు కోసం జీశాట్-7సీ
గతవారం రక్షణ మంత్రిత్వ శాఖ భారత వాయుసేన అవసరాల నిమ్తిత్తం మరో ప్రత్యేక కమ్యూనికేషన్ ఉపగ్రహం ‘జీశాట్-7సీ’ కోసం ఎన్‌ఎ్‌సఐఎల్‌తో రూ.2,563 కోట్ల విలువైన ఒప్పందం చేసుకుంది. ఈ ఉపగ్రహం వైమానిక దళానికి నిరంతరాయ కమ్యూనికేషన్ సామర్థ్యాన్ని కల్పిస్తుంది. కాగా, ఇస్రో గత నవంబరులో నేవీ అవసరాల కోసం ‘జీశాట్-7ఆర్’ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ శాటిలైట్ యుద్ధనౌకలు, విమానాలు, జలాంతర్గాములు, సముద్ర కార్యకలాపాల కేంద్రాల మధ్య నిరాటంకమైన, సురక్షితమైన సమాచారాన్ని చేరవేయడంలో సహాయపడుతోంది.