Share News

భారత్‌-ఫ్రాన్స్‌ వాణిజ్యం ఐదేళ్లలో డబుల్‌

ABN , Publish Date - Jun 15 , 2026 | 03:34 AM

భారత్‌, ఫ్రాన్స్‌ మధ్య ఏటా జరుగుతున్న వాణిజ్యాన్ని ఐదేళ్లలో రెట్టింపు చేయాలని ఇరుదేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతం 16 బిలియన్‌ యూఎస్‌ డాలర్లుగా ఉన్న ఈ వాణిజ్యం విలువను ఐదేళ్లలో .....

భారత్‌-ఫ్రాన్స్‌ వాణిజ్యం ఐదేళ్లలో డబుల్‌

  • పారిస్‌ విమానాశ్రయం, నీస్‌లో భారత యూపీఐ సేవలు

  • భారత్‌, ఫ్రాన్స్‌ ద్వైపాక్షిక చర్చల్లో కీలక నిర్ణయాలు

నీస్‌(ఫ్రాన్స్‌), జూన్‌ 14: భారత్‌, ఫ్రాన్స్‌ మధ్య ఏటా జరుగుతున్న వాణిజ్యాన్ని ఐదేళ్లలో రెట్టింపు చేయాలని ఇరుదేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్రస్తుతం 16 బిలియన్‌ యూఎస్‌ డాలర్లుగా ఉన్న ఈ వాణిజ్యం విలువను ఐదేళ్లలో 32 బిలియన్‌ యూఎస్‌ డాలర్లకు చేర్చాలని నిర్ణయించాయి. అలాగే, ఆవిష్కరణల ప్రణాళిక(ఇన్నోవేషన్‌ రోడ్‌ మ్యాప్‌), కృత్రిమ మేధ(ఏఐ) సాయంతో ముఖ్యమైన రంగాల్లో సంబంధాలు, సహకారాన్ని పెంపొందించుకునేలా ఓ కార్యాచరణ రూపకల్పనకు ముందుకొచ్చాయి. ప్రధాని మోదీ, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్‌ మధ్య ఆదివారం జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఇరుదేశాలు వివిధ రంగాలకు సంబంధించి 13 కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. హైస్పీడ్‌ రైల్వే సెక్టార్‌ అంశంలో పరస్పర సహకారం, క్లాసిఫైడ్‌ డేటా రక్షణకు భద్రతా వ్యవస్థ, పారిస్‌ విమానాశ్రయం, నీస్‌ నగరాల్లో భారత్‌కు చెందిన యూపీఐ సేవలు అందుబాటులోకి తేవడం ఇందులో ముఖ్యమైనవి. వీటితో పాటు ఫ్రాన్స్‌ నుంచి రఫేల్‌ ఫైటర్‌ జెట్ల కొనుగోలు అంశంపై కూడా ఇరువురు నేతల మధ్య జరిగిందని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్త్రీ వెల్లడించారు. అయితే, రక్షణ రంగానికి సంబంధించిన ప్రాజెక్టుల అంశంలో ప్రధాని మోదీ మేక్‌ ఇన్‌ ఇండియా నినాదానికి అంతర్లీనంగా ప్రాధాన్యమిచ్చారని పేర్కొన్నారు. కాగా, ఏఐ గవర్నెన్స్‌, ఉమ్మడి పరిశోధనలు, ఆవిష్కరణలకు, సామర్థ్యం పెంపునకు సంబంధించి ఓ ఏఐ వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటుకు ఇరుదేశాలు అంగీకరించాయి. కాన్పూర్‌లో నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ స్కిల్లింగ్‌ ఇన్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ అలైడ్‌ సెక్టార్స్‌ అనే సంస్థ ఏర్పాటుకు కూడా ఇరుదేశాలు అంగీకారం తెలిపాయి. దాంతోపాటు అణు విద్యుత్‌ రంగంలో పరస్పర సహకారం, ఇందుకు సంబంధించిన ఉమ్మడి ప్రాజెక్టులోని కీలకమైన అంశాలపై ఇరుదేశాల నేతల మధ్య లోతైన చర్చ జరిగినట్టు విక్రమ్‌ మిస్త్రీ పేర్కొన్నారు. వచ్చే వారం నుంచే పారిస్‌లోని చార్లెస్‌ డీగుల్లే విమానాశ్రయంలో, నీస్‌లో యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశముందని తెలిపారు. ఆవిష్కరణలు, డిజిటల్‌ స్పెస్‌ రంగాలకు చెందిన అంశాలపై ఇతర ఒప్పందాలు జరిగాయి. అలాగే, నైపుణ్యం కలిగిన విద్యార్థుల బదిలీ, విద్యార్హతల పరస్పర గుర్తింపు పైకూడా ఇరుదేశాల నేతల మధ్య చర్చ జరిగింది.


భారత్‌ డీఎన్‌ఏలోనే ఆవిష్కరణలు

భారతదేశం డీఎన్‌ఏలోనే ఆవిష్కరణ ఉందని, వైద్యం, యోగా, గణితం, సైన్స్‌ రంగాల్లో చేసిన ఆవిష్కరణలతో ప్రపంచ మానవాళికి భారత్‌ దిశానిర్దేశం చేసిందని మోదీ అన్నారు. భారతదేశం పరిష్కార కేంద్రం(సొల్యూషన్‌ హబ్‌) అని పేర్కొన్నారు. నీస్‌ నగరంలో ఏర్పాటు చేసిన ‘భారత్‌ ఇన్నోవేట్స్‌ 2026’ కాన్‌క్లేవ్‌ను మేక్రాన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మానవాళికి ఎంత ఉపయోగపడ్డాయనే దానిపైనే ఆవిష్కరణల విలువ ఆధారపడి ఉంటుందన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లకు పరిష్కారం చూపేందుకు భారత్‌, ఫ్రాన్స్‌ ఎన్నో ఏళ్లుగా కలిసి పని చేస్తున్నాయని, భారత్‌ ఇన్నోవేటివ్స్‌ కూడా అందులోని భాగమేనని చెప్పారు. మేక్రాన్‌ మాట్లాడుతూ.. భారత్‌ను ఆవిష్కరణల దేశమని కొనియాడారు. మేకిన్‌ ఇండియాలో భాగంగా వివిధ రంగాల్లో తాము భారత్‌తో కలిసి పని చేస్తున్నామని తెలిపారు. స్మాల్‌ మాడ్యూల్‌ రియాక్టర్‌(ఎ్‌సఎంఆర్‌)ల అభివృద్ధి సహా అణు విద్యుత్‌ రంగంలో భారత్‌తో ఉన్న బంధాన్ని విస్తరించేందుకు ఉన్న అవకాశాలను మేక్రాన్‌ ప్రస్తావించారు.

మోదీ-మేక్రాన్‌ ‘ఆరీ ఆరీ’

ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుల్‌ మేక్రాన్‌తో ఆదివారం భేటీ అయ్యారు. అయితే, ప్రధాని మోదీని స్వాగతించినప్పటి నుంచి ఆయనతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న క్లిప్పింగ్స్‌ అన్ని కలిపి రూపొందించిన ఓ వీడియోను మేక్రాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోకు భారతీయ సూపర్‌ హిట్‌ సినిమా దురంధర్‌ దిరివేంజ్‌లోని ‘ఆరీ ఆరీ’ అనే పాటను జోడించడంతో ఆ వీడియో మరింత సంచలనంగా మారింది.

Updated Date - Jun 15 , 2026 | 03:34 AM