భారత్, ఈయూ భారీ డీల్
ABN , Publish Date - Jan 28 , 2026 | 03:22 AM
ట్రంప్ టారిఫ్‌లతో ప్రపంచం అల్లకల్లోలం అవుతున్న వేళ.. భారత్, యూరోపియన్ యూనియన్ ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్‌టీఏ కుదిరింది. వాణిజ్యం కోసం అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం, ఇతర మార్కెట్లను అందిపుచ్చుకోవడం దిశగా భారత్ ముందడుగు వేసింది.
స్వేచ్ఛా వాణిజ్యం సహా 13 ఒప్పందాలు ఖరారు
అమెరికా ఆంక్షల నేపథ్యంలో మన ఉత్పత్తులకు భారీ మార్కెట్
భారత్‌లో యూరప్ లగ్జరీ కార్ల ధరలు భారీగా తగ్గే అవకాశం
రక్షణ రంగంలోనూ సహకారం
ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితికి ఈ ఒప్పందంతో చెక్: మోదీ
ప్రపంచానికి బలమైన సందేశం: ఉర్సులా వాన్
న్యూఢిల్లీ, జనవరి 27: ట్రంప్ టారిఫ్‌లతో ప్రపంచం అల్లకల్లోలం అవుతున్న వేళ.. భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరింది. వాణిజ్యం కోసం అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం, ఇతర మార్కెట్లను అందిపుచ్చుకోవడం దిశగా భారత్ ముందడుగు వేసింది. యూరప్ దేశాలకు ఎగుమతి చేసే చాలా రకాల ఉత్పత్తులపై సుంకాలు పూర్తిగా తొలగిపోనున్నాయి. దీనితో భారత వ్యాపారులు, ఎగుమతిదారులకు ప్రయోజనం కలగనుంది. యూరప్ దేశాల నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే కార్లు, వైన్స్, అత్యవసర ఔషధాలు వంటి వాటి ధరలు తగ్గనున్నాయి. మంగళవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో 16వ భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశం జరిగింది. దానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఒప్పందంపై ప్రకటన చేశారు. ‘‘యూరోపియన్ యూనియన్, భారత్ మధ్య భారీ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. దీన్ని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’ గా అభివర్ణించొచ్చు. ఇటు భారత్‌లోని 140 కోట్ల మంది, ఈయూలోని కోట్లాది మంది ప్రజలకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. భారత్, ఈయూ ఉమ్మడి జీడీపీ ప్రపంచ జీడీపీలో 25ు. ఇది ప్రపంచ వాణిజ్యంలో మూడో వంతుతో సమానం’’ అని మోదీ పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్‌లో భాగమైన 27 దేశాల్లో ఈ ఒప్పందంపై చట్టాలు చేసిన త ర్వాత పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఇందుకోసం ఆరు నెలల నుంచి ఏడాది సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, భారత్-ఈయూ సదస్సులో భాగంగా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లెయెన్, యూ రోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియా కోస్టాలతో ప్రధాని మోదీ భేటీ అయి.. వాణిజ్యంతోపాటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతోపాటు మొత్తం 13 అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వచ్చే ఐదేళ్లకు సంబంధించిన ఉమ్మడి వ్యూహాత్మక ఎజెండాను ఆమోదించారు. అనంతరం ముగ్గురూ మీడియాతో మాట్లాడారు.
ఉద్యోగాలు, విద్య అవకాశాలు కూడా..
2030 నాటికి భారత్, ఈయూ మధ్య వాణి జ్యం, పెట్టుబడులు, డిజటల్ కనెక్టివిటీ బలోపేతం చేసేందుకు.. ఉమ్మడి సమగ్ర, వ్యూహాత్మక ఎజెండాను అనుసరించాలని నిర్ణయించారు. ఇది యూరప్ దేశాల్లో భారత యువత ఉద్యోగాలు, విద్య, పరిశోధన రంగాల్లో మంచి అవకాశాలు పొందేందుకు తోడ్పడనుంది. ఇక విపత్తుల నిర్వహణ, భారత రి జర్వు బ్యాంకు-ఈఎ్‌సఎంఏ (యూరోపియన్ సె క్యూరిటీస్, మార్కెట్స్ అథారిటీ) సహకారం, శాస్త్ర సాంకేతిక భాగస్వామ్య ఒప్పందం పొడిగింపు, గ్రీన్ హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, రహస్య సమాచారం పరస్పర మార్పిడి ఒప్పందంపై చర్చలు చేపట్టడంపైనా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ‘భారత్- మిడిల్ ఈస్ట్- యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎంఈసీ)’ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని, త్వరలోనే మంత్రుల స్థాయి భేటీ నిర్వహించాలని నిర్ణయించారు.
అమెరికా, చైనా దూకుడుకు అడ్డుకట్ట!
ఒకవైపు ట్రంప్ టారి్‌ఫల దూకుడు, మరోవైపు చైనా ఆధిపత్యం, కీలక ఉత్పత్తుల సరఫరాలపై నియంత్రణలతో ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఈయూ-భారత్ ఒప్పందంతో అటు అమెరికా దూ కుడుకు అడ్డుకట్ట వేయడం, ఇటు చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టడం సాధ్యమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య వాణిజ్య ఒప్పందంపై 2007లో చర్చలు మొదలయ్యాయి. వివిధ కారణాలతో మధ్యలో నిలిచిపోయాయి. తిరిగి 2022లో చర్చలు ప్రారంభమయ్యాయి. మొత్తంగా రెండు దశాబ్దాల అనంతరం ఒప్పందం కుదిరింది. గ్రీన్‌లాండ్ అంశంలో ట్రంప్ వ్యవహారశైలి, అమెరికా లేకుంటే యూర్‌పను ఎవరూ పట్టించుకోబోరన్న వ్యాఖ్యలు, టారిఫ్ విధిస్తానంటూ బెదిరించడం తో.. ఆగ్రహంతో ఉన్న ఈయూ భారత్‌తో ఒప్పందంపై చర్చలను వేగవంతం చేసింది.
మనకు అందే ప్రయోజనాలివే
యూరప్ నుంచి దిగుమతి అయ్యే కార్లపై ప్రస్తుతం 125శాతం వరకు సుంకాలు ఉన్నాయి. తాజా ఒప్పందం ప్రకారం 15 వేల యూరోల (సుమారు రూ.16 లక్షలు)పైన ధర ఉన్న కార్లపై సుంకాలు 40శాతానికి తగ్గుతాయి. తర్వాత దశలవారీగా 10శాతానికి తగ్గిస్తారు. దీనితో యూర్‌పకు చెందిన బీఎండబ్ల్యూ, ఆడి, మెర్సిడెజ్, లాంబోర్గిని, పోర్షే వంటి కార్ల ధరలు భారీగా తగ్గుతాయి. ఉదాహరణకు భారత్‌లో లాంబోర్గిని కార్ల ప్రారంభ ధర ప్రస్తుతం సుమారు రూ.3.8 కోట్ల వరకు ఉంది. ఒప్పందం అమల్లోకి వచ్చాక.. సుమారు రూ.2 కోట్లకు ఆ ధర తగ్గిపోయే అవకాశముంది. మరోవైపు భారత్ నుంచి యూరప్ దేశాలకు ఎగుమతి చేసే కార్లపైనా అక్కడి సుంకాలను 10శాతానికి తగ్గిస్తారు. ఇది భారత కంపెనీలకు ప్రయోజనం కలిగిస్తుంది. ఇలా పరస్పరం సుంకాల మినహాయింపును నిర్ధారిత సంఖ్య (ఉదాహరణకు ఏటా 2.5 లక్షల కార్లు) వరకే వర్తింపజేస్తారు. అంతకు మించితే గరిష్ఠ సుంకాలు విధిస్తారు.
యూరప్ దేశాల నుంచి భారత్‌కు వచ్చే వైన్, విస్కీ, వోడ్కా, బీర్ వంటివాటిపై 150శాతం వరకు దిగుమతి సుంకాలు ఉన్నాయి. ఒప్పందం అమల్లోకి వస్తే వైన్‌పై 30శాతానికి, వోడ్కా, విస్కీ వంటి ఆల్కాహాల్ ఉత్పత్తులపై 40శాతానికి, బీర్లపై 50శాతానికి సుంకాలు తగ్గుతాయి. దీనితో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఫ్రెంచ్, ఇటలీ, స్పెయిన్ వైన్, ఇతర ఆల్కాహాలిక్ ఉత్పత్తులు భారత్‌లో తక్కువ ధరకు దొరుకుతాయి. ఇదే సమయంలో భారత వైన్స్, ఆల్కాహాలిక్ ఉత్పత్తులపై యూరప్ దేశాల్లో సుంకాలు తగ్గుతాయి. మన సంస్థల ఎగుమతులు పెరిగే అవకాశం ఉంటుంది.
క్యాన్సర్ ఔషధాలు, బరువు తగ్గించే మందులు సహా కీలక ఫార్మా ఉత్పత్తుల ధరలు 11 శాతం వరకు, వైద్య పరికరాలు ధరలు 25శాతం వరకు తగ్గుతాయి. మందుల తయారీకి వాడే ముడి పదార్థాల ధరలు తగ్గడం వల్ల దేశంలో ఫార్మా కంపెనీలకు ప్రయోజనం కలగనుంది.
విమానాలు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలకా్ట్రనిక్ ఉత్పత్తులపై భారత సుంకాలు తగ్గుతాయి. దీనితో యూరప్ నుంచి వచ్చే సంబంధిత ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి.
యూరప్ నుంచి దిగుమతయ్యే ఇనుము, స్టీలు, రసాయన ఉత్పత్తులపై సుంకాలను ఎత్తివేయనున్నారు. దీనితో ఆయా ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. ఇక భారత్ నుంచి యూరప్ దేశాలకు వస్త్రాలు, తోలు ఉత్పత్తులు, ఆభరణాల ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి.
బిస్కట్లు, పాస్తా, చాకోలెట్లు, పండ్ల రసాలు వంటి ప్రాసెస్డ్ ఉత్పత్తులు, ఆలివ్ ఆయిల్, ఇతర నూనెలపై సుంకాలు ఎత్తివేయడం వల్ల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఏ రంగాలకు లాభం?
ఈయూతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు రంగాలకు ప్రయోజనం దక్కనుంది. ఈయూ దేశాల్లో సుంకాలను గణనీయంగా తగ్గించడంతో ఇక్కడి నుంచి ఎగుమతులు పెరగనున్నాయి. తెలంగాణకు సంబంధించి కీలకంగా ఉన్న ఫార్మా, ఎలకా్ట్రనిక్స్, ఇంజనీరింగ్ పరికరాలు, వస్త్ర పరిశ్రమలకు.. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తులు, రసాయనాలు, ఫార్మా, ఎలకా్ట్రనిక్స్ పరిశ్రమలకు ప్రయోజనం కలగనుంది. అంతేగాకుండా ఇరు రాష్ట్రాల్లోని ఫార్మా సంస్థలకు మందుల ముడి పదార్థాలు యూరోపియన్ దేశాల నుంచి తక్కువ ధరకే అందుతాయి.
‘రక్షణ’లో మరింత సహకారం
రక్షణ రంగంలో భారత్, ఈయూ మధ్య బంధాన్ని బలోపేతం చేసుకోవాలని.. తీర రక్షణ, సైబర్, అంతరిక్ష రంగాలు, ఉగ్రవాద నిరోధక పోరాటంలో మరింత సహకరించుకోవాలని సదస్సులో నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిష్ఠాత్మక రక్షణ, భద్రతా భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఈయూ విదేశీ, భద్రతా వ్యవహారాల చీఫ్ కాజా కల్లాస్ మధ్య జరిగిన భేటీలో దీనిపై చర్చించారు. భారత్‌లో రక్షణ రంగ పరిశ్రమలు సరికొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడానికి, ఈయూ సంస్థలతో కలిసి పనిచేసేందుకు ఈ ఒప్పందం వీలుకల్పించనుంది.

సంస్కరణలు చేపట్టాలి: మోదీ
ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో భారత్-ఈయూ మధ్య వాణిజ్య ఒప్పందం స్థిరత్వానికి బాటలు వేస్తుందని ప్రధాని మోదీ చెప్పారు. ఇది కేవలం ఒక వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదని.. ప్రపంచానికి మేలు చేసేలా, ఉమ్మడి అభివృద్ధి దిశగా సరికొత్త మార్గమని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ స్థాయిలో పరస్పర ప్రయోజనాల పరిరక్షణ, బహుళపక్ష విధానాలను గౌరవించాలని.. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అవసరమని మోదీ స్పష్టం చేశారు. కాగా, అంతర్జాతీయ చట్టాలు, ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు కట్టుబడి ఉండే విషయంలో భారత్, ఈయూ బాధ్యతగా ఉన్నాయని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియా కోస్టా పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహా త్మా గాంధీ మాటలను గుర్తుకు తెచ్చుకున్నారు. ఆయుధాలతో పోరాటంతో శాంతి నెలకొనదని.. అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య కూడా ఆయుధాలు చేతపట్టకుండా న్యాయాన్ని ఆచరిస్తూ నిలబడే దేశాల వల్లే శాంతి నెలకొంటుందని చెప్పారు. ఇక ప్రపంచంలో ప్రస్తుత సవాళ్లకు పరస్పర సహకారమే సరైన సమాధానమనే బలమైన సందేశాన్ని ఈయూ-భారత్ ఒప్పందం పంపిందని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లెయెన్ పేర్కొన్నారు. భారత నైపుణ్యాలు, సేవా రంగాన్ని.. యూరోపియన్ సాంకేతికతలు, పెట్టుబడులు, సృజనాత్మక ఆవిష్కరణలను ఈ ఒప్పందం ఒక్క చోటికి చేర్చుతోందన్నారు.