వాణిజ్య ఒప్పందంచర్చలు వాయిదా
ABN , Publish Date - Feb 23 , 2026 | 01:33 AM
భారత్-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై చర్చలు వాయిదాపడ్డాయి. ఇటీవలే ఒప్పందానికి సంబంధించిన విధివిధానాలపై ఇరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల...
ట్రంప్ సుంకాల్లో మార్పుల నేపథ్యంలోనే..
పరిణామాలను సమీక్షించిన అనంతరం
అమెరికా, భారత్ ఉన్నతాధికారుల భేటీ
ఈ 15శాతం సుంకాలకూ చట్టబద్ధత ఎక్కడ?
ట్రంప్ సుంకాలకు వ్యతిరేకంగా వాదించిన
లాయర్ నీల్ కత్యాల్ మండిపాటు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: భారత్-అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందంపై చర్చలు వాయిదాపడ్డాయి. ఇటీవలే ఒప్పందానికి సంబంధించిన విధివిధానాలపై ఇరు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఒప్పందంలోని అంశాలకు తుది మెరుగులు దిద్ది మార్చి మూడో వారానికల్లా సంతకాలు జరిగేలా ఇరుదేశాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా సోమవారం (23న) నుంచి మూడు రోజులపాటు అమెరికాలోని వాషింగ్టన్‌లో ఇరు దేశాల ఉన్నతాధికారుల బృందాల మధ్య చర్చలు జరగాల్సి ఉంది. కానీ ట్రంప్ అదనపు సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేయడం, దీనితో ఇతర చట్టాల కింద ప్రపంచ దేశాలపై 15శాతం సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించడం నేపథ్యంలో.. వాణిజ్య ఒప్పందంపై చర్చలను వాయిదా వేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిణామాలను సమీక్షించిన అనంతరం చర్చలు తిరిగి ఎప్పుడు జరిగేదీ నిర్ణయించనున్నట్టు వెల్లడించాయి. కాగా, అమెరికా సుప్రీంకోర్టు అదనపు సుంకాలను రద్దు చేయడంతో ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మరో చట్టం కింద ప్రపంచ దేశాలపై 15శాతం సుంకాలను విధించడాన్ని న్యాయవాది నీల్ కత్యాల్ తప్పుబట్టారు. ట్రంప్ అదనపు సుంకాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వాదించి, గెలిచిన ఆయన... ఈ 15శాతం సుంకాలకు చట్టబద్ధత ఎక్కడ ఉందని, చట్టసభలను తోసిరాజని అధ్యక్షుడు ఏకపక్షంగా వ్యవహరించలేరని పేర్కొన్నారు.