వాణిజ్య ఒప్పందంపై త్వరలోనే సంతకాలు
ABN , Publish Date - Oct 22 , 2026 | 04:53 AM
భారత్, అమెరికాల మధ్య కొన్ని అంశాల్లో విభేదాలు ఉన్నప్పటికీ.. కీలకమైన ఉమ్మడి అంశాల్లో పూర్తిస్థాయిలో ఏకాభిప్రాయం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు.
భారత్‌లో నిరసనలు ఆ దేశ అంతర్గత వ్యవహారం: అమెరికా విదేశాంగ మంత్రి రుబియో
ముంబై/న్యూఢిల్లీ, అక్టోబరు 21: భారత్, అమెరికాల మధ్య కొన్ని అంశాల్లో విభేదాలు ఉన్నప్పటికీ.. కీలకమైన ఉమ్మడి అంశాల్లో పూర్తిస్థాయిలో ఏకాభిప్రాయం ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అంతర్జాతీయ జలరవాణా మార్గాలపై ఎవరి పెత్తనం ఉండకూడదని.. స్వేచ్ఛగా రవాణా సాగాలన్నది ఇరుదేశాల అభిప్రాయమని తెలిపారు. ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై త్వరలోనే సంతకాలు జరిగే అవకాశం ఉందని.. కేవలం కొన్ని అంశాల్లో పీటముడి కొనసాగుతోందని చెప్పారు. రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన ఆయన మంగళవారం ముంబైలో ‘ఫ్రీడమ్ 250’ కార్యక్రమంలో పాల్గొన్నారు. బుధవారం గుజరాత్‌లోని రిలయన్స్ జామ్‌నగర్ రిఫైనరీని సందర్శించి మాట్లాడారు. ‘‘భారత్, అమెరికాల మధ్య కొన్ని అంశాల్లో విభేదాలు ఉన్నాయన్నది నిజమే. కానీ ఇంతటి విస్తీర్ణం, ప్రాధాన్యమున్న, ఇరుదేశాల జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న కీలక అంశాలపై మాత్రం భారత్, అమెరికా మధ్య బలమైన ఏకాభిప్రాయం ఉంది. భారత్ శక్తివంతమైన, ప్రభావవంతమైన, అభివృద్ధి చెందిన దేశం. అమెరికాకు బలమైన భౌగోళిక, రాజకీయ భాగస్వామి. 21వ శతాబ్దం ఎలా ఉండబోతోందన్న దాన్ని సానుకూల దిశగా నిర్దేశించడంలో భారత్-అమెరికా సంబంధాలు కీలక పాత్ర పోషిస్తాయని నమ్ముతున్నాను’’ అని రూబియో పేర్కొన్నారు. గత మూడు నెలల్లో రెండోసారి భారత పర్యటనకు వచ్చిన ఆయన.. నిజానికి తాను రావాల్సింత తరచుగా భారత్‌లో పర్యటించడం లేదన్నారు. సీఈసీకి వ్యతిరేకంగా భారత్‌లో సీజేపీ, ప్రతిపక్షాలు చేపట్టిన నిరసనలపై వ్యాఖ్యానించేందుకు రూబియో నిరాకరించారు. భారత్‌లో యువత నిరసనలను కఠినంగా అణచివేస్తున్నారంటూ 20 మంది ఐక్యరాజ్యసమితి నిపుణులు ఆందోళన వ్యక్తం చేయడాన్ని పరోక్షంగా తప్పుపట్టారు. ప్రజలు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయడం ప్రతి దేశంలోనూ సాధారణమేనని, అమెరికాలోనూ ప్రతిరోజూ నిరసనలు జరుగుతాయని స్పష్టం చేశారు. భారత్ ప్రజాస్వామ్య దేశమని, నిరసనలు దేశ అంతర్గత రాజకీయ వ్యవహారమని.. ఈ అంశంలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయలేనని చెప్పారు.
ముఖేశ్ అంబానీతో రుబియో భేటీ
రిలయన్స్ రిఫైనరీని సందర్శించిన సందర్భంగా రూబియో అక్కడ ముఖేశ్ అంబానీ, అనంత్ అంబానీతో భేటీ అయ్యారు. ముడిచమురు శుద్ధిలో భారత్‌ను సూపర్ పవర్‌గా అభివర్ణించారు. వెనెజువెలా నుంచి మరింత చమురు దిగుమతి చేసుకుని, శుద్ధి చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా, భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి చేరువలో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.
మిలిటెంట్ పోరాటాలే: కిసాన్‌సభ
అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే మిలిటెంట్ తరహా పోరాటాలకు దిగుతామని అఖిల భారత కిసాన్‌సభ బుధవారం హెచ్చరించింది. భారీగా సబ్సిడీలుంటే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులతో పోటీపడలేక భారత వ్యవసాయ రంగం, రైతులు తీవ్రంగా దెబ్బతింటారని పేర్కొంది. ఒప్పందంపై చర్చలు తుదిదశకు వచ్చాయని చెబుతున్నారని.. కానీ ఒప్పందంలోని అంశాలేమిటో బయటపెట్టకపోవడం ఆందోళనకరమని స్పష్టం చేసింది.