మనపై తక్కువ సుంకాలే!
ABN , Publish Date - Nov 15 , 2026 | 02:43 AM
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) విషయంలో అమెరికా కీలక హామీ ఇచ్చిందని కేంద్ర వాణిజ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అమెరికా మార్కెట్లో భారత వస్తు సేవలకు..
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై అమెరికా హామీ
కేంద్ర వాణిజ్య శాఖ ఉన్నతాధికారి వెల్లడి
న్యూఢిల్లీ, నవంబరు 14: ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (బీటీఏ) విషయంలో అమెరికా కీలక హామీ ఇచ్చిందని కేంద్ర వాణిజ్య శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అమెరికా మార్కెట్లో భారత వస్తు సేవలకు పోటీదారులుగా ఉండే ఇతర దేశాలతో పోల్చితే.. మన దేశ వస్తుసేవలపై తక్కువ సుంకాలు విధిస్తామని తెలిపిందని వెల్లడించారు. ఈ రకంగా మనకు సమగ్రమైన సుంకాల ప్రయోజనాలు కల్పిస్తామని భరోసా ఇచ్చినట్లు ఆ అధికారిని ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తా సంస్థ శనివారం తెలిపింది. బీటీఏలోని మొదటి దశ ఒప్పందాన్ని ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పూర్తిచేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఇతర దేశాలకంటే తమపై సుంకాలు తక్కువగా ఉండాలని అమెరికాకు షరతు పెట్టింది. ఈ నెల 2- 3 తేదీల్లో ఢిల్లీలో పర్యటించిన ఇద్దరు సభ్యుల అమెరికా బృందం.. మనదేశ అధికారులతో ఈ అంశంపై చర్చలు జరిపింది. ఈ సందర్భంగా తక్కువ సుంకాలపై హామీ ఇచ్చినట్లు ఆ అధికారి తెలిపారు. అయితే, పూర్తి ఒప్పందం కుదిరిన తర్వాతే సుంకాల ప్రయోజనాలు ఎంతమేర ఉంటాయనేది తెలుస్తుందని చెప్పారు.