చెక్కుచెదరని మోదీ బ్రాండ్
ABN , Publish Date - Jan 30 , 2026 | 03:32 AM
దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరింత బలపడిందని ఇండియా టుడే, సీ ఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్-2026 జనవరి’(ఎంవోటీఎన్) సర్వే తేల్చింది.
ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే బీజేపీదే అధికారం
ఇండియా టుడే-సీ ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ, జనవరి 29: దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరింత బలపడిందని ఇండియా టుడే, సీ ఓటర్ ‘మూడ్ ఆఫ్ ది నేషన్-2026 జనవరి’(ఎంవోటీఎన్) సర్వే తేల్చింది. ప్రధాని మోదీపై దేశ ప్రజలకు ఉన్న నమ్మకం ఏమాత్రం సడలలేదని పేర్కొంది. దేశవ్యాప్తంగా గత 8 వారాల్లో 1.25 లక్షల మందిని సర్వే చేసి అంచనా వేసిన ఈ సర్వే ఫలితాలను గురువారం విడుదల చేశారు. లోక్‌సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధికార ఎన్డీయే కూటమికి 352 ఎంపీ సీట్లు వస్తాయని సర్వే తేల్చింది. 2024లో ఈ కూటమి మెజారిటీకి అవసరమైన 272 సీట్లనూ సాధించలేకపోయింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఆ పార్టీ సొంతంగా 287 సీట్లు గెలిచి మళ్లీ సంపూర్ణ మెజారిటీ సాధిస్తుందని సర్వే తేల్చింది. ప్రతిపక్ష ఇండియా కూటమి 182 సీట్లకే పరిమితం అవుతుందని పేర్కొంది.