Share News

టారిఫ్‌‌లపై స్పష్టత ఇచ్చాకే అమెరికాతో వాణిజ్య ఒప్పందం

ABN , Publish Date - Mar 17 , 2026 | 03:37 AM

అమెరికా ప్రభుత్వం రూపొందించనున్న నూతన సుంకాల విధానంపై స్పష్టత వచ్చిన తరువాతే ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్టు భారత్‌ వెల్లడించింది.

టారిఫ్‌‌లపై స్పష్టత ఇచ్చాకే అమెరికాతో వాణిజ్య ఒప్పందం

  • కేంద్ర వాణిజ్య కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌ వెల్లడి

న్యూఢిల్లీ, మార్చి 16: అమెరికా ప్రభుత్వం రూపొందించనున్న నూతన సుంకాల విధానంపై స్పష్టత వచ్చిన తరువాతే ఆ దేశంతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్టు భారత్‌ వెల్లడించింది. నూతన సుంకాల వివరాలు ఇవ్వాలని ఆ దేశాన్ని కోరినట్టు భారత వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్‌ అగర్వాల్‌ చెప్పారు. సోమవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఈ అంశంపై ఆ దేశంతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. ఆ దేశ టారిఫ్‌‌ల విధానం ఖరారైన తరువాత వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేస్తామని చెప్పారు. గత నెలలో వాణిజ్య ఒప్పంద ఫ్రేంవర్క్‌పై తాత్కాలిక అవగాహన కుదిరింది. ఈ నెలలో ఒప్పందంపై సంతకాలు చేసుకోవాలని ప్రతిపాదించినప్పటికీ, అమెరికాలో తలెత్తిన పరిణామాలు ఇందుకు అడ్డంకిగా నిలిచాయి. టారిఫ్‌‌లను ఇష్టానుసారంగా పెంచుతూ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాంతో అమెరికా రాజ్యాంగంలోని 122వ అధికరణాన్ని ఉపయోగించుకొని 10శాతం టారి్‌ఫలను విధిస్తూ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకొంది. గత నెలలో ఒప్పందం ఫ్రేంవర్క్‌పై చర్చలు జరిగినప్పుడు భారత్‌పై 18శాతం టారిఫ్‌ విధించాలన్న అవగాహన కుదిరింది. పోటీ దేశాలైన చైనా, వియత్నాం, థాయ్‌లాండ్‌ కన్నా తక్కువ టారిఫ్‌ ఉండాలని భారత్‌ కోరుతోంది. ఒకవేళ ఇతర దేశాలపై 19, 20, 21 శాతం అన్న తరహాలో టారి్‌ఫలు విధిస్తే భారత్‌పై 18శాతం టారిఫ్‌ కొనసాగనుంది. అదే ఆ దేశాలపై తక్కువ టారిఫ్‌ వేస్తే అందుకు అనుగుణంగా తమపై టారిఫ్‌ భారం తగ్గించాలని అంటోంది. సుంకాల ప్రమేయంలేని ఆంక్షలు, సెక్షన్‌ 232లో పేర్కొన్న టారిఫ్‌‌లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడంపై చర్చలు జరుగుతున్నట్టు అగర్వాల్‌ తెలిపారు. ఒప్పందం కుదిరేలోగానే ఇవన్నీ కొలిక్కి వచ్చేలా చూస్తామని చెప్పారు.

Updated Date - Mar 17 , 2026 | 03:37 AM