Share News

మరో 114 రఫేల్స్‌

ABN , Publish Date - Feb 13 , 2026 | 06:09 AM

భారత త్రివిధ దళాల పోరాట పటిమను మరింత పెంచటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.

మరో 114 రఫేల్స్‌

  • వాయుసేన కోసం 3.25 లక్షల కోట్లతో కొనుగోలు

  • ప్రధాని నేతృత్వంలోని సీసీఎస్‌ అంగీకారం లభించగానే కొనుగోళ్లు షురూ

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: భారత త్రివిధ దళాల పోరాట పటిమను మరింత పెంచటమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. సైన్యం, వాయుసేన, నౌకాదళాల కోసం దాదాపు రూ.3.60 లక్షల కోట్ల విలువైన యుద్ధ విమానాలు, ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ (డీఏసీ) ఆమోదం తెలిపింది. ఇందులో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు కీలకమైంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో గురువారం సమావేశమైన డీఏసీ.. వాయుసేన కోసం 114 రఫేల్‌ మల్టీ రోల్‌ కంబాట్‌ యుద్ధ విమానాలు కొనుగోలుకు ఆమోదం (యాక్సెప్టెన్స్‌ ఆఫ్‌ నెసెస్సిటీ) తెలిపింది. వీటిని ఫ్రాన్స్‌కు చెందిన డసో ఏవియేషన్‌ సంస్థ తయారు చేస్తోంది. ఈ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్‌-భారత ప్రభుత్వాలు ఒప్పందం చేసుకోనున్నాయి. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌ భారత పర్యటనకు రాను న్న నాలుగు రోజుల ముందు ఈ విమానాల కొనుగోలుకు ఆమోదం తెలపటం గమనార్హం. ఆయన ఈ నెల 17వ తేదీ నుంచి 19 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. భారత వాయుసేన 42 ఫైటర్‌ స్క్వాడ్రన్‌లు నిర్వహించుకునేందుకు రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. ఒక్కో స్క్వాడ్రన్‌లో 18 నుంచి 20 యుద్ధ విమానాలు ఉంటాయి. అయితే, భారత వాయుసేనలో నుంచి పాతతరం యుద్ధ విమానాలను తొలగించటంతో ప్రస్తుతం 31 స్క్వాడ్రన్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అత్యాధునిక బహుళ ప్రయోజన యుద్ధ విమానాల అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం, 2019లోనే 114 మల్టీరోల్‌ కంబాట్‌ ఫైటర్‌ జెట్ల (ఎంఆర్‌ఎ్‌ఫఏ) కొనుగోలు కోసం రిక్వెస్ట్‌ ఫర్‌ ఇన్ఫర్మేషన్‌ (ఆర్‌ఎ్‌ఫఐ)ను జారీ చేసింది. దీంతో ఐఏఎ్‌ఫతో డీల్‌ కోసం డసో ఏవియేషన్‌ రఫేల్స్‌తోపాటు లాక్‌హీడ్‌ మార్టిన్‌కు చెందిన ఎఫ్‌-21, బోయింగ్‌ ఎఫ్‌/ఏ18, యూరోఫైటర్‌ టైఫూన్‌ పోటీ ప డ్డాయి. భారత ప్రభుత్వం వీ టన్నింటి సామర్థ్యాన్ని లోతుగా పరిశీలించిన అనంతరం రఫేల్స్‌ వైపే మొగ్గు చూపింది. భారత వాయుసేన వద్ద ఇప్పటికే 36 రఫేల్‌ ఫైటర్‌ జెట్లు ఉన్నాయి. గత ఏడాది పాకిస్థాన్‌పై నిర్వహించిన ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో ఇవి కీలక పాత్ర పోషించాయి. దీంతో వాయుసేన వీటివైపే మొగ్గు చూపింది. భారత నేవీకి 26 రఫేల్‌-ఎం రకం జెట్ల కొనుగోలు కోసం కూడా గత ఏడాది ఏప్రిల్‌లో భారత్‌-ఫ్రాన్స్‌ ప్రభుత్వాల మధ్య ఇంటర్‌ గవర్నమెంటల్‌ అగ్రిమెంట్‌ (ఐజీఏ) కుదిరింది. తాజాగా వాయుసేన కోసం మరో 114 రఫేల్‌ విమానాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి మొత్తం విలువ రూ.2.90 లక్షల కోట్ల నుంచి 3.25 లక్షల కోట్లు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. వీటి కొనుగోలు కోసం ప్రధాని మోదీ నేతృత్వంలోని రక్షణ వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఎస్‌) తుది అనుమతి ఇవ్వాల్సి ఉంది.


సీసీఎస్‌ అనుమతి రాగానే రఫేల్‌ విమానాలతోపాటు వాటికి అమర్చే ఆయుధ వ్యవస్థలు, క్షిపణుల ధరపై డసో ఏవియేషన్‌తో రక్షణ శాఖ చర్చలు జరపనుంది. దీంతో ఈ డీల్‌పై తుది నిర్ణయానికి రావటానికి మరికొంత సమయం పడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాయుసేన కోసం కంబాట్‌ మిసైళ్లు, ‘ఎయిర్‌ షిప్‌ బేస్డ్‌ హై ఆల్టిట్యూడ్‌ సూడో శాటిలైట్‌’ (ఏఎ్‌స-హెచ్‌ఏపీఎ్‌స)ను కూడా కొనుగోలు చేయాల్సిన అవసరం ఉందని డీ ఏసీ నిర్ణయించింది. ఈ శాటిలైట్‌ను నిఘా, ఎలకా్ట్రనిక్‌ ఇంటెలిజెన్స్‌, టెలీకమ్యూనికేషన్స్‌, రిమోట్‌సెన్సింగ్‌ కోసం వినియోగిస్తారని ప్రభుత్వం తెలిపింది. 114 రఫేల్స్‌లో డసో ఏవియేషన్‌ 18 పూర్తిగా తయారైన విమానాలను ఐఏఎ్‌ఫకు సరఫరా చేస్తుంది. మిగతావాటిని భారత్‌లోనే తయారు చేస్తారు.

సైన్యం, నేవీకి కూడా..

ఐఏఎ్‌ఫతోపాటు సైన్యం, నౌకాదళం కోసం కీలకమైన ఆయుధాలు, విమానాలు కొనుగోలు చేయాలని డీఏసీ నిర్ణయించింది. సైన్యం కోసం యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేయగల వైభవ్‌ మైన్స్‌ కొనుగోలుకు ఏవోఎన్‌ జారీచేసింది. వీటితోపాటు టీ-72 యుద్ధ ట్యాంకులు, ఆర్మర్డ్‌ రికవ రీ వెహికిల్స్‌ (ఏఆర్‌వీలు), బీఎంపీ-2ల ప్లాట్‌ఫాం ఓవర్‌హోల్స్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. యుద్ధ రంగంలో సాయుధ వాహనాలు, ట్యాంకులు దెబ్బతిన్నప్పుడు, వాటిని తరలించేందుకు, రిపేర్‌ చేసేందుకు ఈ ప్లాట్‌ఫాం ఓవర్‌హోల్స్‌ను వినియోగిస్తారు. నౌకాద ళం కోసం ఎండబ్ల్యూ మెరైన్‌ గ్యాస్‌ టర్బైన్‌ ఆధారిత ఎలక్ట్రిక్‌ పవర్‌ జనరేటర్‌ను, పీ8ఐ సముద్ర నిఘా విమానాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

డార్నియర్ల కోసం హాల్‌తో ఒప్పందం

భారత కోస్ట్‌గార్డ్‌ కోసం 8 డార్నియర్‌ 228 రకం విమానాలు కొనుగోలు చేసేందుకు హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌)కు చెందిన కాన్పూర్‌లోని ట్రాన్స్‌పోర్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ డివిజన్‌తో గురువారం ఒప్పందం చేసుకున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. ఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్‌సింగ్‌ సమక్షంలో జరిగిన ఈ ఒప్పందం విలువ రూ.2,312 కోట్లు అని వెల్లడించింది.

Updated Date - Feb 13 , 2026 | 06:09 AM