Share News

మార్చి 31 నాటికి..

ABN , Publish Date - Feb 09 , 2026 | 01:42 AM

రానున్న మార్చి 31కల్లా భారత్‌ నక్సల్స్‌ రహిత దేశంగా మారబోతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పునరుద్ఘాటించారు.

మార్చి 31 నాటికి..

  • నక్సల్స్‌ రహిత దేశంగా భారత్‌

  • కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

  • రాయ్‌పూర్‌లో అధికారులతో సమీక్ష

న్యూఢిల్లీ, రాయ్‌పూర్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి) : రానున్న మార్చి 31కల్లా భారత్‌ నక్సల్స్‌ రహిత దేశంగా మారబోతోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పునరుద్ఘాటించారు. మరికొద్ది వారాల్లో గడువు ముగియనుండడంతో నక్సల్స్‌ వ్యతిరేక ఆపరేషన్లపై ఛత్తీ్‌సగఢ్‌ ప్రభుత్వం, అధికారులతో రాయ్‌పూర్‌లో ఆదివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. భద్రతా బలగాలను ఏకం చేయడం, మౌలిక వసతుల విస్తరణ, మావోయిస్టుల ఆర్థిక నెట్‌వర్క్‌ను దెబ్బతీయడం, లొంగుబాటు పాలసీల వంటివి నక్సలిజంపై పోరాటంలో సత్ఫలితాలను ఇచ్చినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఛత్తీ్‌సగఢ్‌ ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయి, ఉప ముఖ్యమంత్రి విజయ్‌ శర్మ, కేంద్ర హోం కార్యదర్శి, ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌, హోం వ్యవహారాల శాఖ స్పెషల్‌ సెక్రటరీ, సీఆర్‌పీఎఫ్‌, బీఎ్‌సఎఫ్‌, ఐటీబీపీ, ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా, మహారాష్ట్ర, జార్ఖండ్‌, తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. కాగా విధ్వంసకర కమ్యూనిస్టు సిద్ధాంతం దేశానికి ఇక ఎంతమాత్రం అవసరం లేదని అమిత్‌ షా పేర్కొన్నారు. నక్సలైట్లు తమ ఆయుధాలను వీడాలని కోరారు. నవా రాయ్‌పూర్‌లో ఆదివారం నిర్వహించిన ఒక కాంక్లేవ్‌లో మాట్లాడుతూ ఈమేరకు పేర్కొన్నారు. కమ్యూనిస్టుల పాలన ఉన్నచోట అభివృద్ధి ఉండదన్నారు. ప్రజాస్వామ్యంలో ఆ సిద్ధాంతానికి కాలం చెల్లిందని, త్రిపుర, పశ్చిమ బెంగాల్‌లలో వారి పాలన ముగిసిందన్నారు. కేరళలో ఉన్నా అక్కడా తిరువనంతపురం నుంచి మార్పు మొదలైందని పేర్కొన్నారు.

Updated Date - Feb 09 , 2026 | 01:42 AM