Share News

పెట్రోలు, డీజిల్‌పై.. ఎక్సైజ్‌ సుంకం భారీగా తగ్గింపు

ABN , Publish Date - Mar 28 , 2026 | 04:35 AM

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మండుతున్నాయి. భారత్‌లోనూ పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు పెంచుతారని పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో..

పెట్రోలు, డీజిల్‌పై.. ఎక్సైజ్‌ సుంకం భారీగా తగ్గింపు

  • యుద్ధంతో నష్టాల నుంచి కంపెనీలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

  • ఈ నిర్ణయంతో కేంద్రంపై ఏటా రూ.1.75 లక్షల కోట్ల భారం!

న్యూఢిల్లీ, మార్చి 27: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మండుతున్నాయి. భారత్‌లోనూ పెట్రోలు, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలు పెంచుతారని పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని భారీగా తగ్గించింది. అయితే ఇది చమురు కంపెనీలకు మాత్రమే వర్తిస్తుంది. దేశీయంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరగకుండా నిరోధించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పెట్రోలుపై లీటరుకు ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకం ప్రస్తుతం రూ.13 ఉండగా.. పది రూపాయలు తగ్గించింది. అలాగే లీటర్‌ డీజిల్‌పై ఇప్పుడు రూ.10 ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకంగా ఉండగా.. దానిని పూర్తిగా తొలగించింది. ఈ నిర్ణయం వల్ల కేంద్రంపై ఏడాదికి రూ.1.75 లక్షల కోట్ల భారం పడుతుంది. వీటితోపాటే ఇంధన ఎగుమతులను నియంత్రించడానికి డీజిల్‌, ఏవియేషన్‌ టర్బయిన్‌ ఫ్యుయల్‌ (ఏటీఎఫ్‌)పై ఎగుమతి సుంకాన్ని ప్రభుత్వం పునరుద్ధరించింది. డీజిల్‌పై లీటరుకు రూ.21.50, ఏటీఎ్‌ఫపై లీటరుకు రూ.29.50 చొప్పున ఈ సుంకం విధించింది. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కారణంగా రిఫైనరీలు డీజిల్‌, ఏటీఎఫ్‌ ఎగుమతులతో బాగా లాభాలు ఆర్జించాయి. దీంతో 2022 జూలైలో కేంద్రం మొదటిసారి ఎగుమతి పన్ను విధించింది. 2024 డిసెంబరులో ఉపసంహరించింది. ఇప్పుడు ఇంధన సంక్షోభం నేపథ్యంలో మళ్లీ రిఫైనరీలు లాభాల కోసం ఇంధన ఎగుమతులకు దిగకుండా తాజాగా పన్ను విధించింది. దేశీయంగా క్రూడాయిల్‌ ఉత్పత్తిచేసే ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్‌జీసీకి మాత్రం మినహాయింపు ఇచ్చింది. పశ్చిమాసియాలో యుద్ధ సంక్షోభం కారణంగా బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర 100 డాలర్లకు చేరింది. పెరిగిన ధరల ప్రకారం.. మన దేశంలో లీటరు పెట్రోలుపై రూ.26, డీజిల్‌పై రూ.81.90 పెంచాల్సి ఉంటుందని కేంద్ర ఇంధన శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే ఆగ్నేయాసియా దేశాలు 30 నుంచి 50 శాతం.. ఉత్తర అమెరికాలో సుమారు 30 శాతం, ఐరోపాలో 20 శాతం, ఆఫ్రికా దేశాల్లో సుమారు 50 శాతం వరకు పెంచాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.


ఎగుమతి పన్నుతో 1,500 కోట్ల రాబడి!

చమురు కంపెనీల నష్టాలను తగ్గించేందుకు ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన కేంద్రం.. ఇదే సమయంలో పెట్రోలు, డీజిల్‌, ఏటీఎఫ్‌పై కొత్తగా ఎగుమతి సుంకం విధింపు ద్వారా వచ్చే 15 రోజుల్లో రూ.1,500 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేస్తోంది. ఈ రేట్లను 15 రోజులకోసారి సమీక్షిస్తామని కేంద్ర పరోక్ష పన్నులు-కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) చైర్మన్‌ వివేక్‌ చతుర్వేది వెల్లడించారు. కాగా.. అదనపు ఎక్సైజ్‌ సుంకం తగ్గింపుతో ప్రస్తుతం లీటరు పెట్రోలుపై ఎక్సైజ్‌ పన్ను రూ.11.90 (ఇందులో మౌలిక ఎక్సైజ్‌ పన్ను రూ.1.40, ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ పన్ను రూ.3, వ్యవసాయ మౌలిక వసతులు-అభివృద్ధి సెస్‌ రూ.2.50, రోడ్ల మౌలిక వసతుల పన్ను రూ.5-మొత్తం రూ.11.90)గా ఉంది. డీజిల్‌పై లీటరుకు ఎక్సైజ్‌ పన్ను రూ.7.80(ఇందులో మౌలిక ఎక్సైజ్‌ పన్ను రూ.1.80, వ్యవసాయ మౌలిక వసతులు-అభివృద్ధి సెస్‌ రూ.4, రోడ్ల మౌలిక వసతుల పన్ను రూ.2-మొత్తం రూ.7.80)గా ఉంది. దేశంలో ఏటా 115 బిలియన్‌ లీటర్ల పెట్రోలు, 60 లీటర్ల డీజిల్‌ విక్రయాలు జరుగుతున్నాయి. అదనపు ఎక్సైజ్‌ సుంకం తగ్గింపుతో ఏటా ప్రభుత్వం రూ.1.75 లక్షల కోట్ల భారం భరించాల్సి ఉంటుందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. మరోవైపు.. మొత్తంగా చమురు అంశాలపై నిరంతర సమీక్షకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పెట్రోలియం మంత్రి హర్‌దీ్‌పసింగ్‌ పురీతో త్రిసభ్య కమిటీని కేంద్రం నియమించింది.

అసెంబ్లీ ఎన్నికల కోసమే: కాంగ్రెస్‌

అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాలను ప్రభుత్వం తగ్గించిందని కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం ఆరోపించింది. గత 12 ఏళ్లలో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఏడుసార్లు తగ్గినప్పటికీ దేశంలో సామాన్య వినియోగదారుడికి ఏమాత్రం ఉపశమనం లభించలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. ‘పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గుతున్నాయన్న వార్తలు చూసి ప్రభుత్వం మీ జేబుకు ఏదో ఉపశమనం కలిగించిందని భావిస్తే మీరు పొరబడినట్లే’ అని కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. రష్యా నుంచి రాయితీ ధరకు చమురు కొనుగోలు చేసినప్పటికీ, ఆ ప్రయోజనాలు వినియోగదారులకు దక్కలేదన్నారు.


ఎక్సైజ్‌ సుంకంతో 2014 నుంచి భారీ ఆదాయం

ప్రత్యేక అదనపు ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించడం వల్ల కేంద్రంపై పడే భారం.. 12 ఏళ్లుగా అదే ఎక్సైజ్‌ సుంకంతో వచ్చిన రాబడితో పోల్చితే తక్కువేనని రాజకీయ, మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. క్రూడాయిల్‌ ధరలు తగ్గుతున్నా..2014 నవంబరు నుంచి 2016 జనవరి మధ్య మోదీ ప్రభుత్వం 10సార్లు ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచింది. దీంతో అప్పట్లో లీటరు పెట్రోలుపై సుంకం రూ.12, డీజిల్‌పై రూ.13.77 వరకు పెరిగింది. 2021-22 మధ్య కొవిడ్‌ సమయంలో క్రూడాయిల్‌ ధర 69 శాతం పతనమైనా కేంద్రం ఎక్సైజ్‌ సుంకం పెంచింది. అప్పుడు ఎక్సైజ్‌ సుంకం పెట్రోల్‌పై రూ.19.90, డీజిల్‌పై రూ.15.80గా ఉంది. నాడు భారీ ఆదాయాన్ని ఆర్జించిన కేంద్రం.. ఇప్పుడు ఇరాన్‌ యుద్ధం పర్యవసానంగా అందులో నుంచి కొంత తిరిగి చెల్లిస్తోందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మోదీ సర్కారు 2014 నవంబరు-2016 జనవరి మధ్య 15నెలల్లో ఎక్సైజ్‌ సుంకం పెంపు ద్వారా రూ.2.42లక్షల కోట్లు ఆర్జించింది. ఇది అంతకుముందు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం హయాంలో కన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. అయితే, ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నందువల్లే ప్రజలపై భారం వేయకుండా కేంద్రం ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిందన్న వాదనలున్నాయి. ప్రైవేటు సంస్థ నయారా ఇప్పటికే పెట్రోలుపై లీటరుకు రూ.5.30, డీజిల్‌పై రూ.3 పెంచింది. కాగా, బ్యారెల్‌ చమురు ధర 125 డాలర్లకు చేరితే ఎన్నికలయ్యాక పెట్రోలు, డీజిల్‌ ధరలను రూ.10-15 పెంచే అవకాశం ఉందని అంచనా.

Updated Date - Mar 28 , 2026 | 04:35 AM