వాణిజ్య నౌకలపై దాడులు సరికాదు: భారత్
ABN , Publish Date - Mar 21 , 2026 | 03:49 AM
వాణిజ్య నౌకలపై దాడులు చేయడం సరికాదని భారత్ హెచ్చరించింది. నావికా సిబ్బంది ప్రాణాలకు ముప్పు తలపెట్టే చర్యలను మానుకోవాలని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, మార్చి 20: వాణిజ్య నౌకలపై దాడులు చేయడం సరికాదని భారత్ హెచ్చరించింది. నావికా సిబ్బంది ప్రాణాలకు ముప్పు తలపెట్టే చర్యలను మానుకోవాలని స్పష్టం చేసింది. ఐక్యరాజ్యసమితికి చెందిన మ్యారిటైమ్ విభాగం అయిన ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్స్ కౌన్సిల్(ఐఎమ్‌వో) 36వ సదస్సు లండన్‌లో జరిగింది. బ్రిటన్‌లో భారత రాయబారి విక్రమ్ దొరైస్వామి ఈ సదస్సులో పాల్గొని మాట్లాడారు. పశ్చిమాసియా లోని యుద్ధ ఉద్రిక్తతలు సముద్ర వాణిజ్యాన్ని ఘోరంగా దెబ్బతీయడాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘హోర్ముజ్ సహా ప్రపంచంలోని ప్రతి జలసంధి గుండా ప్రయాణించే స్వేచ్ఛ వాణిజ్య నౌకలకు ఉండాలి. అంతర్జాతీయ చట్టాలను ఆ మేరకు కట్టుదిట్టం చేయాలి’’ అని ఆయన కోరారు. ‘‘యుద్ధంలో భాగంగా నౌకలు, పోర్టులు లక్ష్యంగా జరుగుతున్న దాడుల్లో ఇప్పటివరకు భారత్‌కు చెందిన ముగ్గురు నౌకా సిబ్బంది మరణించారు’’ అని తెలిపారు. భారతపతాకం కలిగిన 24 నౌకలు హోర్ముజ్‌తోపాటు పశ్చిమాసియా సముద్ర పరిధిలో ప్రస్తుతం ప్రయాణిస్తున్నాయని అన్నారు.