Economic growth: ఎగువ మధ్య ఆదాయ దేశంగా భారత్!
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:35 AM
ఎగువ మధ్య ఆదాయ దేశాలుగా ఉన్న చైనా, ఇండోనేషియాల సరసన భారత్ కూడా త్వరలోనే చేరనుంది. ఈ దశాబ్దం చివరి నాటికి ఎగువ మధ్య ఆదాయ దేశంగా అవతరించనుంది.
రూ.3.63 లక్షలకు చేరనున్న స్థూల తలసరి ఆదాయం
త్వరలో జర్మనీని దాటి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భావం
చైనా, ఇండోనేషియాల సరసనచేరనున్న భారత్.. ఎస్‌బీఐ విశ్లేషణ
న్యూఢిల్లీ, జనవరి 19: ఎగువ మధ్య ఆదాయ దేశాలుగా ఉన్న చైనా, ఇండోనేషియాల సరసన భారత్ కూడా త్వరలోనే చేరనుంది. ఈ దశాబ్దం చివరి నాటికి ఎగువ మధ్య ఆదాయ దేశంగా అవతరించనుంది. స్థూల తలసరి ఆదాయం రూ.3,63,462(4 వేల డాలర్లు)కు చేరనుంది. అదేసమయంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా మారనుంది. ఈ మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎ్‌సబీఐ) తన విశ్లేషణలో స్పష్టం చేసింది. ‘‘భారత స్థూల తలసరి ఆదాయం రూ.3,63,462కు చేరనుందన్న అంచనాల నేపథ్యంలో ఎగువ మధ్య ఆదాయ దేశాలుగా ఉన్న చైనా, ఇండోనేషియాల సరసన భారత్ కూడా చేరనుంది’’అని ఎస్‌బీఐ పేర్కొంది. ఈ విశ్లేషణకు ఇటీవల ప్రపంచ బ్యాంకు ఉదహరించిన అంశాలను జోడించింది. తలసరి స్థూల జాతీయ ఆదాయం ఆధారంగా ప్రపంచ బ్యాంకు వివిధ దేశాలను మధ్య అధిక ఆదాయ, ఉన్నత మధ్య ఆదాయ దేశాలుగా వర్గీకరించింది. దీనికిగాను 1990-2024 మధ్య గణాంకాలను పరిగణనలోకి తీసుకుంది. ఈ లెక్కల ప్రకారం.. చైనా తలసరి ఆదాయం 1990లో 330 డాలర్లు ఉండగా.. 2024 నాటికి పుంజుకుని ఉన్నత మధ్య ఆదాయ దేశంగా మారింది. ప్రపంచ బ్యాంకు సూచీల ప్రకారం అల్పాదాయ దేశాలు 26 ఉండగా, దిగువ మధ్యస్థ ఆదాయ దేశాలుగా 50, ఉన్నత మధ్య ఆదాయ దేశాలుగా 54 ఉన్నాయి. ఇక, అధిక ఆదాయ దేశాల సంఖ్య పెరిగి 87కు చేరింది.
మరిన్ని కీలక విషయాలు..
ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అమెరికా తన స్థాయిని నిలబెట్టుకుంది.
2028 నాటికి జర్మనీని తోసిపుచ్చి భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోనుంది. 1962లో 90 డాలర్లుగా ఉన్న భారత తలసరి అల్ప ఆదాయం నుంచి 910డాలర్లకు చేరడానికి60ఏళ్లు పట్టింది.
ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించేందుకు భారత్‌కు తొలి విడత 60ఏళ్లు పట్టగా, 2014 నాటికి 2 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థకు చేరింది. 2021 నాటికి 3 ట్రిలియన్ డాలర్లు, 2025నాటికి 4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారింది.
మరో రెండేళ్లలో భారత్ రమారమి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరనుంది. భారత స్థూల తలసరి ఆదాయం 2026నాటికి రూ.2,72,611, 2030నాటికి రూ. 3,63,462కు చేరనుంది.