పశ్చిమాసియాకు ఖాళీ ట్యాంకర్లు!
ABN , Publish Date - Mar 30 , 2026 | 04:11 AM
హోర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో ప్రస్తుతం 20 వరకు భారత చమురు, గ్యాస్ నౌకలు సముద్రంలో నిలిచిపోయాయి. మరోపక్క ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర స్థాయిలో డ్రోన్లు,క్షిపణుల యుద్ధం జరుగుతోంది.
చమురు, గ్యాస్ కోసం పంపిస్తున్న భారత్
న్యూఢిల్లీ, మార్చి 29: హోర్ముజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో ప్రస్తుతం 20 వరకు భారత చమురు, గ్యాస్ నౌకలు సముద్రంలో నిలిచిపోయాయి. మరోపక్క ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర స్థాయిలో డ్రోన్లు,క్షిపణుల యుద్ధం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో చమురు, గ్యాస్ రీఫిల్ కోసం భారత్ పశ్చిమాసియాకు ఖాళీ ట్యాంకర్లు పంపుతుండడం గమనార్హం. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తోపాటు సౌదీ యువరాజు మహ్మద్ సల్మాన్, కువైత్, ఖతార్, ఒమాన్ దేశాధినేతలతో ప్రధాని మోదీ నిరంతరం చర్చలు జరుపుతూ.. భారత్‌కు చమురు, గ్యాస్ సరఫరా సజావుగా సాగేలా సహకరించాలని కోరుతున్నారు. ఇప్పటికి 4ఎల్‌పీజీ, 2 చమురు నౌకలు విజయవంతంగా హోర్ముజ్ దాటాయి. వీటిలో ఐదు భారత రేవులకు చేరుకున్నాయి. మరొకటి ‘పైన్ గ్యాస్’ 47 వేల టన్నుల ఎల్‌పీజీతో భారత సముద్ర జలాల్లోకి ప్రవేశించింది. ఏప్రిల్ 2నాటికి ఒడిసాలోని ధామ్రా పోర్టుకు చేరుకోనుంది. ఇంకో ఐదు చమురు నౌకలకు హోర్ముజ్ గుండా క్లియరెన్సు ఇవ్వాలని ఇరాన్ నాయకత్వంతో భారత్ సంప్రదింపులు జరుపుతోంది. వీటిలో ఎల్‌పీజీ లోడ్లు ఉన్న జగ్ విక్రమ్, గ్రీన్ ఆషా, గ్రీన్ శాన్వి.. రస్ అల్ ఖైమా(యూఏఈ)లోని మీనా సఖ్ర్ రేవులో లంగరు వేసి ఉన్నాయి.