Share News

వెండి దిగుమతులపై ఆంక్షలు

ABN , Publish Date - May 17 , 2026 | 04:59 AM

విదేశీ మారక ద్రవ్యం ఆదా చేయడం లక్ష్యంగా వెండి దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. ప్రస్తుతం స్వేచ్ఛగా దిగుమతి చేసుకునేందుకు అవకాశమున్న...

వెండి దిగుమతులపై ఆంక్షలు

  • ధరలు పెరిగే అవకాశం ఉందంటున్న నిపుణులు

  • విదేశీ మారకద్రవ్యం ఆదా కోసమే చర్యలు: కేంద్రం

న్యూఢిల్లీ, మే 16: విదేశీ మారక ద్రవ్యం ఆదా చేయడం లక్ష్యంగా వెండి దిగుమతులపై కేంద్రం ఆంక్షలు విధించింది. ప్రస్తుతం స్వేచ్ఛగా దిగుమతి చేసుకునేందుకు అవకాశమున్న ‘ఫ్రీ కేటగిరీ’ నుంచి వెండిని కఠిన నియంత్రణలు అమలు చేసే ‘రిస్ట్రిక్టెడ్‌’ కేటగిరీకి మార్చింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దీనితో మార్కెట్లో వెండి సరఫరా తగ్గి, ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కేంద్రం ఇప్పటికే బంగారం దిగుమతులపై కస్టమ్స్‌ సుంకాన్ని ఆరుశాతం నుంచి 15శాతానికి పెంచిన విషయం తెలిసిందే. ఇప్పుడు వెండిని ‘రిస్ట్రిక్టెడ్‌’ కేటగిరీలోకి మార్చడంతో సరఫరాపై ప్రభావం పడుతుంది. ఇకపై వెండి దిగుమతి చేసుకునేవారికి తప్పనిసరిగా ప్రత్యేక లైసెన్సు ఉండాలి. దిగుమతి కోసం ముందే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. పైగా ఈ దిగుమతులకు రిజర్వుబ్యాంకు మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. దీనితో మార్కెట్లో వెండి సరఫరాపై నియంత్రణ పెరుగుతుందని, అది ధరల పెరుగుదలకు దారితీస్తుందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. వెండిని కేవలం ఆభరణాలు, వస్తువుల కోసమే కాకుండా.. ఎలక్ర్టిక్‌ పరికరాలు, సోలార్‌ ప్యానెళ్లు, వైద్య పరికరాలు, రసాయన ఉత్ర్పేరకంగా పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. ఇప్పుడు ఆయా రంగాలపైనా ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, అత్యవసరం కాని వస్తువుల దిగుమతులను నియంత్రించడం ద్వారా విదేశీ మారకద్రవ్యం ఆదా చేయడం, రూపాయి విలువ పడిపోకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర వాణిజ్యశాఖ అధికారులు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో వెండి దిగుమతులు 42శాతం పెరిగాయని, కానీ ధర విపరీతంగా పెరగడంతో దానికి చెల్లించిన సొమ్ము ఏకంగా 150శాతం పెరిగిందని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో వెండి దిగుమతుల విలువ ఏకంగా రూ.1.15 లక్షల కోట్లు (12 బిలియన్‌ డాలర్లు) దాటిపోయిందని తెలిపారు.

Updated Date - May 17 , 2026 | 04:59 AM