Share News

అవి నిరాధార ఆరోపణలు.. మస్క్‌ పోస్టు‌పై స్పందించిన కేంద్రం

ABN , Publish Date - Oct 08 , 2026 | 11:15 AM

స్టార్‌లింక్‌కు భారత్‌లో అనుమతులు రాకుండా కొందరు బడా కుబేరులు అడ్డుకుంటున్నారంటూ ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది.

అవి నిరాధార ఆరోపణలు.. మస్క్‌ పోస్టు‌పై స్పందించిన కేంద్రం
Communications Ministry on Musk Comments

ఇంటర్నెట్ డెస్క్: స్టార్‌లింక్‌కు భారత్‌లో అనుమతులు రాకుండా కొందరు బడా కుబేరులు అడ్డుకుంటున్నారంటూ ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. భారత్ అనుమతుల జారీ విధానంలో ఎలాంటి వివక్ష, అన్యాయాలు ఉండవని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. శాటిలైట్ సేవలు, సహా టెలికం కమ్యూనికేషన్స్ విషయంలో ఎలాంటి పక్షపాత ధోరణి ఉండదని స్పష్టం చేసింది.


శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తెచ్చే దిశగా సంస్థలకు లైసెన్సులు జారీ చేసేందుకు నిర్ణయించినట్టు సమాచార శాఖ పేర్కొంది. ఇందుకు సంబంధించిన నిబంధనల ప్రకారం, ఆయా సంస్థలు భారత భద్రతా నిబంధనలకు కట్టుబడి ఉన్నట్టు నిరూపించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. యూజర్లు, వారి డేటా భద్రత కోసం మార్గదర్శకాలను ఏర్పాటు చేశామని పేర్కొంది. పరిశీలన పూర్తయ్యాక మాత్రమే స్పెక్ట్రమ్ కేటాయింపు ఉంటుందని పేర్కొంది. మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌కు గతేడాది ప్రాథమిక స్థాయిలో అనుమతులు లభించిన విషయం తెలిసిందే. అయితే, పూర్తిస్థాయిలో సేవలు ప్రారంభించేందుకు కావాల్సిన తుది అనుమతులు మాత్రం ఇంకా జారీ కాలేదు.


స్టార్‌లింక్‌తో పాటు భారతీ ఎయిర్‌టె‌ల్‌కు చెందిన ఈయూటెల్‌శాట్‌కు, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్ సంస్థకు జీఎమ్‌పీసీఎస్ లైసెన్సులు జారీ చేశామని కేంద్ర సమాచార శాఖ పేర్కొంది. భద్రతా అంశాల పరంగా ఈ సంస్థల దరఖాస్తుల పరిశీలన ప్రస్తుతం కొనసాగుతోందని చెప్పింది. ఈ మూడు సంస్థల పరిశీలన కూడా ఒకే దశలో ఉన్నట్టు వివరించింది. లైసెన్స్‌ల జారీ ప్రక్రియ అన్యాయంగా, పక్షపాతధోరణితో ఉందన్న ఆరోపణలు నిరాధారమని స్పష్టం చేసింది.


స్టార్‌లింక్‌పై అనుమతుల జారీలో జాప్యంపై ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా సంచలన ఆరోపణలు చేశారు. మార్కెట్‌పై తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకునేందుకు కొందరు స్టార్‌లింక్‌కు అడ్డుపడుతున్నారని అన్నారు. వారెవరో జనాలకు తెలుసని కూడా చెప్పుకొచ్చారు. ఈ పోస్టు ప్రస్తుతం దుమారం రేపుతోంది.

Updated Date - Oct 08 , 2026 | 12:12 PM