Share News

విదేశీ పర్యటనలకు తగ్గిన భారం!

ABN , Publish Date - Feb 02 , 2026 | 03:54 AM

విదేశీ పర్యటనలకు వెళ్లే భారతీయులకు కేంద్రం బడ్జెట్‌లో కాస్త ఉపశమనం కల్పించింది. విదేశీ పర్యటనల కోసం తీసుకెళ్లే/ఖర్చు చేసే సొమ్ముపై ‘మూలం వద్ద వసూలు చేసే పన్ను...

విదేశీ పర్యటనలకు తగ్గిన భారం!

  • విదేశాల్లో విద్య, వైద్యం కోసం పంపే సొమ్ముపైనా టీసీఎస్‌ 2 శాతానికి తగ్గింపు

  • ఆదాయ పన్నులో కొత్తగా మినహాయింపులు లేవు

  • సరళీకరించిన పన్ను విధానం ఏప్రిల్‌ నుంచి అమల్లోకి..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: విదేశీ పర్యటనలకు వెళ్లే భారతీయులకు కేంద్రం బడ్జెట్‌లో కాస్త ఉపశమనం కల్పించింది. విదేశీ పర్యటనల కోసం తీసుకెళ్లే/ఖర్చు చేసే సొమ్ముపై ‘మూలం వద్ద వసూలు చేసే పన్ను (టీసీఎ్‌స)’ను 2శాతానికి తగ్గించింది. ఇప్పటివరకు రూ.10 లక్షల వరకు 5శాతం, ఆపైన వ్యయంపై 20శాతం పన్ను ఉండేది. ఇప్పుడు సొమ్ము పరిమితిని పూర్తిగా తొలగించి, ఒకేలా 2శాతం టీసీఎ్‌సను వసూలు చేయనున్నట్టు కేంద్రం తెలిపింది. ఇక విదేశాల్లో విద్య, వైద్యం కోసం పంపే/తీసుకెళ్లే సొమ్ముపైనా టీసీఎ్‌సను 2 శాతానికి కుదించింది. విదేశాల్లో చదువుకోసం వెళ్లే కుటుంబాలకు ఇది కాస్త ఉపశమనం కలిగించనుంది. వైద్యం, విద్య కోసం కాకుండా ఇతర అవసరాల కోసం విదేశాలకు తీసుకెళ్లే సొమ్ముపై మాత్రం 20శాతం టీసీఎస్‌ కొనసాగుతుంది. ‘సరళీకృత రెమిటెన్సుల స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌)’ కింద ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఇక ఆల్కహాల్‌, తుక్కు, ఖనిజాల (బొగ్గు, లిగ్నైట్‌, ఇనుప ఖనిజం వంటివి)విక్రయాలపై టీసీఎ్‌సను 2శాతానికి పెంచింది. బీడీల తయారీకి వాడే తునికి ఆకులపైనా టీసీఎస్‌ను 5శాతం నుంచి 2శాతానికి తగ్గించింది. ఆదాయ పన్నులో ఈసారి ఎలాంటి మార్పులూ చేయలేదు.

ఆదాయ పన్ను శ్లాబులు యథాతథం

గత ఏడాది పేర్కొన్న మినహాయింపులు యథాతథంగా కొనసాగనున్నాయి. ఇక కేంద్రం గత ఏడాది ప్రతిపాదించిన కొత్త ఆదాయ పన్ను చట్టం-2025 ఈ ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. సాధారణ ప్రజలు కూడా సులభంగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసేలా సరళీకరించిన కొత్త ఫారాలు, నిబంధనలపై త్వరలో నోటిఫికేషన్‌ జారీ చేస్తామని నిర్మల తెలిపారు. ఇక ప్రస్తుత చట్టంలో ఉన్న అసె్‌సమెంట్‌ సంవత్సరం, అంతకు ముందటి సంవత్సరం వంటి వాటిని తొలగించి.. సులువుగా ‘పన్ను సంవత్సరం (ట్యాక్స్‌ ఇయర్‌)’గా కొత్త చట్టంలో చేర్చారు. ఇక గడువు ముగిసిన తర్వాత ఐటీ రిటర్నులు దాఖలు చేసినా టీడీఎస్‌ సొమ్మును రీఫండ్‌ పొందడానికి అవకాశం కల్పించారు. సవరించిన ఐటీ రిటర్నుల దాఖలుకు తుది గడువును డిసెంబర్‌ 31 నుంచి తర్వాతి సంవత్సరం మార్చి 31వరకు పెంచారు. ఆదాయం వివరాలను తప్పుగా చూపిస్తే పన్నుతో పాటు అదనంగా 100 శాతం జరిమానా విధిస్తారు. వాహన ప్రమాదాల పరిహారంపై వచ్చే వడ్డీలను ఆదాయ పన్ను నుంచి మినహాయించారు. ఎన్నారైల నుంచి ఇళ్లు, భూములు కొనుగోలు చేసేవారు ‘ట్యాన్‌’ వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదని.. పాన్‌ కార్డు ఇస్తే సరిపోతుందని వెల్లడించారు.

Updated Date - Feb 02 , 2026 | 03:54 AM