భారత్‌కు మరో 45 వేల టన్నుల ఎల్పీజీ
ABN , Publish Date - May 04 , 2026 | 03:41 AM
భారతదేశానికి 45 వేల టన్నుల ఎల్పీజీ(వంట గ్యాస్) తీసుకొస్తున్న కార్గో నౌక ‘సర్వ్ శక్తి’ శనివారం సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటింది.
హోర్ముజ్ దాటిన కార్గో నౌక ‘సర్వ్ శక్తి’.. 13న విశాఖకు
న్యూఢిల్లీ, మే 3: భారతదేశానికి 45 వేల టన్నుల ఎల్పీజీ(వంట గ్యాస్) తీసుకొస్తున్న కార్గో నౌక ‘సర్వ్ శక్తి’ శనివారం సురక్షితంగా హోర్ముజ్ జలసంధిని దాటింది. ఈ నౌక మార్షల్ ఐలాండ్స్ జెండాతో వస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. నౌకలో 18 మంది భారతీయులు సహా మొత్తం 20 మంది సిబ్బంది ఉన్నారు. ఈనెల 13న ఈ నౌక విశాఖపట్నానికి చేరుకుంటుందని భావిస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ గుండా నౌకల రాకపోకలు బాగా తగ్గిపోయాయి. భద్రతా కారణాలతో అనేక నౌకలు ఈ మార్గంలో రావడం లేదు. గత బుధవారం 6 నౌకలు మాత్రమే ఈ జలసంధిని దాటాయి. సర్వ్ శక్తి నౌక తీసుకొస్తున్న ఎల్పీజీని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) కొనుగోలు చేసినట్టు షిప్పింగ్ డాక్యుమెంట్ల ఆధారంగా బ్లూమ్‌బర్గ్ సంస్థ వెల్లడించింది. బ్లూమ్‌బర్గ్ కథనం మేరకు దుబాయిలో మరో నౌక నుంచి ఈ ఎల్పీజీని నింపుకున్న సర్వ్ శక్తి నౌక ఫిబ్రవరి మొదట్లో పర్షియన్ గల్ఫ్‌లోకి ప్రవేశించింది.