అత్యంత కాలుష్య దేశాల్లో ఆరో స్థానంలో భారత్
ABN , Publish Date - Mar 25 , 2026 | 03:32 AM
ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ ఆరో స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఉత్తరప్రదేశ్‌లోని ‘లోని’ టాప్‌లో ఉంది.
న్యూఢిల్లీ, మార్చి 24: ప్రపంచవ్యాప్తంగా అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ ఆరో స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఉత్తరప్రదేశ్‌లోని ‘లోని’ టాప్‌లో ఉంది. ఈ జాబితాలో ఢిల్లీకి నాలుగో స్థానం దక్కింది. ‘వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్-2025’ ప్రకారం వాయు కాలుష్యానికి కారణమయ్యే సూక్ష్మ ధూళి కణాల స్థాయి పీఎం2.5 పరంగా చూస్తే.. ప్రపంచంలోని అత్యంత కాలుష్య దేశాల్లో భారత్ ఆరో స్థానంలో నిలిచింది. మన పొరుగు దేశాలైన పాకిస్థాన్ మొదటి, బంగ్లాదేశ్ రెండో స్థానంలో నిలిచాయి. స్విట్జర్లాండ్‌కు చెందిన గాలి నాణ్యత పర్యవేక్షణ సంస్థ ‘ఐక్యూఎయిర్..’ ప్రపంచవ్యాప్తంగా 143 దేశాల్లోని 9,446 నగరాల డేటాను విశ్లేషించి ఈ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం ప్రపంచంలోని టాప్-10 కలుషిత నగరాల జాబితాలో ఐదు (లోని, బెర్నిహాట్, ఢిల్లీ, ఘజియాబాద్, ఉలా) భారత్‌లోనే ఉన్నాయి. టాప్-25 కాలుష్య నగరాలన్నీ భారత్, పాకిస్థాన్, చైనాల్లోనే ఉన్నాయి. ప్రపంచ నగరాల్లో 14 శాతం మాత్రమే డబ్ల్యూహెచ్‌వో నిర్దేశించిన వార్షిక పీఎం2.5 ప్రమాణాలను చేరుకోగలిగాయని ఈ నివేదిక తెలిపింది.