హోర్ముజ్‌లోనౌకలపై దాడి సరికాదు
ABN , Publish Date - May 18 , 2026 | 02:34 AM
హోర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుత నౌకాయానానికి ఆటంకం కలిగించడం, వాణిజ్య నౌకలపై దాడి చేయడం, సిబ్బందికి ముప్పు తలపెట్టడం ఆమోదయోగ్యం ....
ఐరాసలో ఆందోళన వ్యక్తం చేసిన భారత్
ఐక్యరాజ్యసమితి, మే 17: హోర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుత నౌకాయానానికి ఆటంకం కలిగించడం, వాణిజ్య నౌకలపై దాడి చేయడం, సిబ్బందికి ముప్పు తలపెట్టడం ఆమోదయోగ్యం కాదని ఐక్యరాజ్యసమితిలో భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. శుక్రవారం జరిగిన ఐరాస ఆర్థిక, సామాజిక మండలి(యునెకోసొక్) సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడారు. ఒమన్ తీరంలో భారతీయ జెండా కలిగిన వాణిజ్యనౌకపై ఈనెల 13న జరిగిన దాడిని ఆయన ప్రస్తావించారు. సోమాలియా నుంచి వస్తున్న ఆ నౌకపై ఎవరు దాడిచేశారనేది స్పష్టం కాలేదు. అయితే, నౌకలోని 14 మంది సిబ్బందిని ఒమన్ అధికారులు కాపాడారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల తాజాగా ఏర్పడిన ఇంధన, ఎరువుల సంక్షోభంపై భారత వైఖరిని సమావేశంలో వివరించినట్టు ‘ఎక్స్’లో హరీశ్ పోస్టుచేశారు. కాగా, ఇప్పటి వరకు భారతీయ జెండా కలిగిన రెండు నౌకలపై ఆ మార్గంలో దాడి జరిగింది.