అంతరిక్షంలో మన ‘దృష్టి’
ABN , Publish Date - May 04 , 2026 | 03:47 AM
భారతీయ ప్రైవేటు అంతరిక్ష రంగంలో చరిత్రాత్మక ముందడుగు పడింది. బెంగళూరుకు చెందిన అంతరిక్ష స్టార్టప్ ‘గెలాక్స్‌ఐ’ అభివృద్ధి చేసిన భూపరిశీలన...
ప్రపంచంలోనే తొలి ఆప్టోసార్ ఉపగ్రహం కక్ష్యలోకి
భూపరిశీలన ఉపగ్రహ ప్రయోగం విజయవంతం
స్పేస్‌ఎక్స్ రాకెట్ ద్వారా కాలిఫోర్నియా నుంచి ప్రయోగం
న్యూఢిల్లీ, మే 3: భారతీయ ప్రైవేటు అంతరిక్ష రంగంలో చరిత్రాత్మక ముందడుగు పడింది. బెంగళూరుకు చెందిన అంతరిక్ష స్టార్టప్ ‘గెలాక్స్‌ఐ’ అభివృద్ధి చేసిన భూపరిశీలన ఉపగ్రహం ‘దృష్టి’ విజయవంతంగా కక్ష్యలోకి దూసుకెళ్లింది. స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్9 రాకెట్ సాయంతో ఆదివారం కాలిఫోర్నియాలోని ప్రయోగ కేంద్రం నుంచి దీన్ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్టు గెలాక్స్‌ఐ ప్రకటించింది. ‘దృష్టి’ అనేది ప్రపంచంలోనే ఆప్టో సార్ సాంకేతికత కలిగిన తొలి ఇమేజింగ్ ఉపగ్రహమని ఆ సంస్థ వెల్లడించింది. ఎలకో్ట్ర ఆప్టికల్ (ఈవో), సింథటిక్ అపెర్చర్ రాడార్ (ఎస్‌ఏఆర్) సెన్సర్లను ఒకే ఆపరేషనల్ ప్లాట్‌ఫామ్‌లో అనుసంధానించినట్టు తెలిపింది. దీని సాయంతో రెండు వేర్వేరు రకాల డేటాను ఒక చోట చేర్చి, పగలు రాత్రి తేడా లేకుండా ఎలాంటి వాతావరణంలోనైనా అత్యంత స్పష్టమైన, సమగ్రమైన భూ పరిశీలన సమాచారాన్ని పొందవచ్చని పేర్కొంది. ఈ భూపరిశీలన ఉపగ్రహం రక్షణ, వ్యవసాయం, విపత్తు నిర్వహణ, సముద్ర పర్యవేక్షణ, మౌలిక సదుపాయాల ప్రణాళిక వంటి వివిధ రంగాలకు సమాచారం అందించడంలో ఉపయోగపడుతుందని వెల్లడించింది. ఇస్రో ఇటీవల తన వార్షిక నివేదికలో పేర్కొన్న 29 క్రియాశీల భూపరిశీలనా ఉపగ్రహాలతో సహా.. భారత్ చేపట్టిన అనేక కార్యక్రమాలకు కూడా ‘దృష్టి’ తోడ్పాటునందిస్తుందని భావిస్తున్నారు. 190 కిలోల బరువున్న దృష్టి భారత్‌లోని ప్రైవేటు సంస్థలు నిర్మించిన అతిపెద్ద శాటిలైట్లలో ఒకటని గెలాక్స్‌ఐ తెలిపింది. ఆప్టో-సార్ టెక్నాలజీతో పనిచేసే ఈ ఉపగ్రహం 1.5 మీటర్ల రిజల్యూషన్‌తో స్పష్టమైన చిత్రాలు అందిస్తుందని పేర్కొంది. కాగా, 2030 నాటికి మిషన్ దృష్టిని పది ఉపగ్రహాల సమూహంగా విస్తరించాలని గెలాక్స్‌ఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘ఎక్స్’ వేదికగా గలాక్స్‌ఐ బృందాన్ని అభినందించారు. దృష్టి ప్రయోగం విజయవంతంపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా హర్షం వ్యక్తం చేశారు. భారత అంతరిక్ష ప్రయాణంలో ఇదొక కీలక మైలురాయి అని ఎక్స్‌లో పేర్కొన్నారు.