భారత్‌లో విద్యుత్ డిమాండ్.. ఆల్‌టైమ్ రికార్డు
ABN , Publish Date - Apr 26 , 2026 | 06:32 PM
భారత్‌లో ఈ నెల 24న విద్యుత్ డిమాండ్ 252 గిగావాట్‌ల గరిష్ఠ స్థాయికి చేరుకుందని గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా గణాంకాల్లో తేలింది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్న వేళ దేశంలో విద్యుత్ డిమాండ్ కూడా కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నెల 24న విద్యుత్ డిమాండ్ 252 గిగావాట్‌ల వద్ద ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని తాకింది. గ్రిడ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా ఈ వివరాలను వెల్లడించింది.
ప్రభుత్వ డేటా ప్రకారం, ఏప్రిల్ 24న మధ్యాహ్నం 3.28 గంటల సమయంలో దేశంలో విద్యుత్ డిమాండ్ 252.1 గిగావాట్‌ల గరిష్ఠ స్థాయిని తాకింది. ఏసీల వినియోగం అధికం కావడంతో విద్యుత్‌కు డిమాండ్ పెరిగినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్‌లో చివరిసారిగా 2024 మే 30న అత్యధికంగా 249.9 గిగావాట్‌ల డిమాండ్ నమోదైంది.
ఈ ఏడాది ఎండలు ఉద్ధృతంగా ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేసింది. ఈ నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ 271 గిగావాట్‌లకు చేరవచ్చని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ నెలలోనే విద్యుత్ డిమాండ్ మరో గరిష్ఠ స్థాయిని తాకవచ్చని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇక గతేడాది ఎండల తీవ్రత తక్కువగా ఉండటంతో ఏప్రిల్ నెలలో విద్యుత్ డిమాండ్ 235 గిగావాట్‌లను తాకింది. గతేడాది గరిష్ఠంగా జూన్ 12న 242.8 గిగావాట్‌ల డిమాండ్ కనిపించింది. ఈ ఏడాది ఉత్తరాది, ఈశాన్య ప్రాంతాల్లో చలి వాతావరణం కారణంగా జనవరి 9నే విద్యుత్ డిమాండ్ 245 గిగావాట్‌లను తాకింది.