Share News

విద్యుత్‌ జాగ్రత్తగా వాడండి

ABN , Publish Date - May 23 , 2026 | 06:05 AM

వేసవి తాపం దెబ్బకు దేశం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. రోజురోజుకు ఎండలు, వడగాలుల తీవ్రత అధికమవుతోంది. అదే సమయంలో దేశంలో విద్యుత్‌ వినియోగం కూడా రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది.

విద్యుత్‌ జాగ్రత్తగా వాడండి

  • పగటి వేళల్లో విద్యుత్‌ డిమాండ్‌ పెరిగిపోతోంది

  • ప్రజలకు కేంద్ర విద్యుత్‌ శాఖ పిలుపు

న్యూఢిల్లీ, మే 22 : వేసవి తాపం దెబ్బకు దేశం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. రోజురోజుకు ఎండలు, వడగాలుల తీవ్రత అధికమవుతోంది. అదే సమయంలో దేశంలో విద్యుత్‌ వినియోగం కూడా రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది. ఎండ వేడిమి, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు ఫ్యాన్లు, ఏసీలు, కూలర్ల వినియోగం అధికమవ్వడమే ఇందుకు కారణం. పగటి వేళల్లో విద్యుత్‌ డిమాండ్‌ రోజురోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యుత్‌ శాఖ ప్రజలకు కీలక పిలుపునిచ్చింది. విద్యుత్‌ వినియోగం అంశంలో కాస్త జాగ్రత్తలు పాటించాలని, ఆచితూచి వ్యవహరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌ శాఖ ఎక్స్‌లో శుక్రవారం ఓ పోస్టు చేసింది. ‘‘తీవ్రమైన వడగాలుల వల్ల దేశంలో విద్యుత్‌ డిమాండ్‌ విపరీతంగా పెరుగుతోంది. గత నాలుగు రోజులుగా నమోదైన విద్యుత్‌ డిమాండ్‌ గత రికార్డులను తిరగరాసింది. పగటి వేళల్లో ముఖ్యంగా మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్య విద్యుత్‌ డిమాండ్‌ చాలా అధికంగా నమోదైంది. ఈ డిమాండ్‌ మే 18వ తేదీన 257.37 గిగావాట్లగా నమోదవ్వగా.. మే 19వ తేదీ అది 260.45 గిగావాట్లకు పెరిగింది. మే 20న 265.44 గిగావాట్లగా నమోదైన విద్యుత్‌ డిమాండ్‌ మే 21వ తేదీకి ఏకంగా 270.82 గిగావాట్లకు చేరింది. పెరుగుతోన్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్‌ సరఫరా చేసేందుకు మేము సిద్ధంగానే ఉన్నాం. అయితే, మండు వేసవి కావడంతో అందరం విద్యుత్‌ వినియోగంలో కొంచెం తెలివిగా, ఆచితూచి వ్యవహరిద్దాం’’ అని ఇంధన శాఖ పేర్కొంది. కాగా, శుక్రవారం మధ్యాహ్నం ప్రపంచంలోనే అత్యంత వేడిగా ఉన్న టాప్‌-100 నగరాల్లో 97 నగరాలు భారతదేశంలోనే ఉన్నట్టు ఏక్యూ:ఐ(ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌) నివేదిక చెబుతోంది. ఏక్యూ:ఐ గణాంకాల ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 2.50 గంటలప్పుడు ఒడిసాలోని బాలంగీర్‌లో, బిహార్‌లోని సాసారాంలో 48 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని వారాణసిలో 47 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. దేశంలోని చాలా నగరాల్లో శుక్రవారం మధ్యాహ్నం 45 డిగ్రీలకు పైనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - May 23 , 2026 | 06:05 AM