Rafale Deal: 114 రాఫెల్స్ కోసం 3.25 లక్షల కోట్ల భారీ డీల్
ABN , Publish Date - Jan 15 , 2026 | 04:44 AM
దేశ రక్షణ రంగంలోనే భారీ రాఫెల్ డీల్‌కు రంగం సిద్ధమవుతోంది. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) కోసం ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు నిమిత్తం...
భారత్‌లోనే తయారు చేసేలా ప్రణాళికలు
రక్షణ శాఖ పరిశీలనలో ప్రతిపాదిత డీల్
న్యూఢిల్లీ, జనవరి 14: దేశ రక్షణ రంగంలోనే భారీ రాఫెల్ డీల్‌కు రంగం సిద్ధమవుతోంది. భారత వైమానిక దళం (ఐఏఎఫ్) కోసం ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు నిమిత్తం ప్రతిపాదిత రూ.3.25 లక్షల కోట్ల ఒప్పందాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ పరిశీలించనుంది. ఈ వారాంతంలో జరిగే ఉన్నత స్థాయి సమావేశంలో దీనిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఫ్రాన్స్‌తో ఒప్పందంలో భాగంగా ప్రారంభ దశలో 30 శాతం స్వదేశీ భాగాలతో ఈ విమానాలను భారత్‌లోనే తయారు చేసేలా ప్రణాళికలు రూపొందించారు. ముందుగా డెలివరీకి సిద్ధంగా ఉన్న 12 నుంచి 18 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడం ఈ ఒప్పందంలో భాగమని రక్షణ శాఖకు చెందిన అగ్రశ్రేణి వర్గాలు తెలిపాయి. మిగిలిన విమానాలను భారత్‌లోనే తయారు చేయనున్నారు. కాగా, రాఫెల్ ప్లాట్‌ఫామ్స్‌పై స్వదేశీ ఆయుధాలు, దేశీయంగా అభివృద్ధి చేసిన ఇతర వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి ఫ్రాన్స్ ఆమోదాన్ని కూడా భారత్ కోరనుంది. అయితే.. యుద్ధ విమానాల్లో కీలకమైన మిషన్ వ్యవస్థల సోర్స్ కోడ్‌లు మాత్రం ఫ్రాన్స్ వద్దే ఉంటాయి. ఈ ఒప్పందం ఆమోదం పొందితే రాఫెల్ డీల్ భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద రక్షణ కాంట్రాక్టుగా నిలవనుంది. అలాగే ఈ 114 ఫైటర్ జెట్ల చేరికతో భారత్ వద్దనున్న రాఫెల్స్ సంఖ్య 176కు పెరగనుంది. ఐఏఎఫ్ ఇప్పటికే 36 రాఫెల్ జెట్లను నడుపుతుండగా, భారత నావికా దళం గతేడాది ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై మోహరించడానికి 26 జెట్ల కోసం ఆర్డర్ చేసింది. తమకు 114 రాఫెల్ జెట్లు కావాలని వైమానిక దళం కొన్ని నెలల క్రితం రక్షణ శాఖకు ప్రతిపాదనలు పంపింది.