Share News

డీజిల్‌లో ఐసో బ్యూటనాల్‌!

ABN , Publish Date - Jul 05 , 2026 | 05:55 AM

దేశ పెట్రోలియం దిగుమతుల బిల్లును తగ్గించుకునే దిశగా కేంద్రం మరో ఆలోచన చేస్తోంది. పెట్రోల్‌లో ఇథనాల్‌ కలిపినట్టుగా డీజిల్‌లో ఐసోబ్యూటనాల్‌ను కలిపి విక్రయించాలని నిర్ణయించింది.

డీజిల్‌లో ఐసో బ్యూటనాల్‌!

  • పెట్రోల్‌లో ఇథనాల్‌ కలిపినట్టుగా..డీజిల్‌లో 15శాతం కలిపేందుకు నిర్ణయం

  • ఇప్పటికే ఉన్న డీజిల్‌ ఇంజన్లలో వినియోగించే వీలు: నితిన్‌ గడ్కరీ

న్యూఢిల్లీ, జూలై 4: దేశ పెట్రోలియం దిగుమతుల బిల్లును తగ్గించుకునే దిశగా కేంద్రం మరో ఆలోచన చేస్తోంది. పెట్రోల్‌లో ఇథనాల్‌ కలిపినట్టుగా డీజిల్‌లో ఐసోబ్యూటనాల్‌ను కలిపి విక్రయించాలని నిర్ణయించింది. ఇథనాల్‌ను పెట్రోల్‌లో నేరుగా కలపవచ్చు. కానీ డీజిల్‌లో కలపడానికి వీలుండదు. దీనితో ఇథనాల్‌ను ఐసోబ్యూటనాల్‌గా మార్చి డీజిల్‌లో కలుపుతారు. కేంద్ర రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ తాజాగా ప్రత్యామ్నాయ ఇంధనాలపై భారత రోడ్‌మ్యా్‌పను వివరిస్తూ ఐసోబ్యూటనాల్‌ అంశాన్ని వెల్లడించారు. డీజిల్‌లో 15శాతం ఐసోబ్యూటనాల్‌ను కలపాలని నిర్ణయించినట్టు తెలిపారు. దీనిపై ప్రయోగాత్మక పరిశీలన ఇప్పటికే పూర్తయిందని, మంచి ఫలితాలు వచ్చాయని చెప్పారు. వంద శాతం ఇథనాల్‌, ఐసోబ్యూటనాల్‌తో రెండు జనరేటర్లను విజయవంతంగా నడిపామని, ఈ ఇంధనాలతో నడిచే ఇంజన్లను రూపొందించడం సాధ్యమని దీనితో స్పష్టమైందని వెల్లడించారు. కాగా, ఇప్పటికే డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా బయోడీజిల్‌ వంటి పలు జీవ ఇంధనాలను అభివృద్ధి చేశారు. వాటితో పోలిస్తే ఐసోబ్యూటనాల్‌ ఉత్పత్తికి తక్కువ ఖర్చు అవుతుందని, ఇది విడుదల చేసే శక్తి ఎక్కువని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇప్పటికే ఉన్న డీజిల్‌ ఇంజన్లలో వాడేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. మొక్కజొన్న, బియ్యం, చెరుకు వంటివాటి నుంచి ఇథనాల్‌ను తయారు చేసిన విధానంలోనే ఐసోబ్యూటనాల్‌ను తయారు చేస్తారు. అయితే ఇందుకోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన బ్యాక్టీరియా, యీస్ట్‌ను వినియోగిస్తారు. మరోవైపు ఇథనాల్‌ నుంచి కూడా పలు రసాయన ప్రక్రియల ద్వారా ఐసోబ్యూటనాల్‌ను తయారు చేస్తారు. పెట్రోల్‌, ఇథనాల్‌ వంటివాటితో పోలిస్తే దీనికి మండే గుణం తక్కువ. కానీ ఎక్కువ శక్తిని విడుదల చేస్తుంది. ఇథనాల్‌ తరహాలోనే ఐసోబ్యూటనాల్‌ తయారీ కోసం లీటరుకు సుమారు రూ.55 నుంచి రూ.80 వరకు ఖర్చవుతుందని అంచనా.

Updated Date - Jul 05 , 2026 | 05:55 AM