Share News

ఇంధన సంక్షోభాన్ని అధిగమించాం: మోదీ

ABN , Publish Date - Jul 05 , 2026 | 05:52 AM

ఈ శతాబ్దంలోనే అతిపెద్దదైన ఇంధన సంక్షోభాన్ని భారత్‌ విజయవంతంగా ఎదుర్కొందని ప్రధాని మోదీ చెప్పారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇంధన కొరత...

ఇంధన సంక్షోభాన్ని అధిగమించాం: మోదీ

జైపూర్‌, జూలై 4: ఈ శతాబ్దంలోనే అతిపెద్దదైన ఇంధన సంక్షోభాన్ని భారత్‌ విజయవంతంగా ఎదుర్కొందని ప్రధాని మోదీ చెప్పారు. పశ్చిమాసియా యుద్ధం వల్ల అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇంధన కొరత, సరఫరా సమస్యలు, ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడినా భారత్‌ మాత్రం దౌత్యం, స్నేహంతో ఇంధన సరఫరా పెంచుకుని ప్రజలపై భారం పడకుండా చూసిందన్నారు. గతంలో 26 దేశాలకే పరిమితమైన చమురు, గ్యాస్‌ దిగుమతులను 40 దేశాలకు విస్తరింపచేశామన్నారు. రాజస్థాన్‌లోని పచ్‌పద్రాలో దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్‌ రీఫైనరీ పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరగడంతో ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య భారత చమురు కంపెనీలకు రూ.75వేల కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన గుర్తు చేశారు. అయితే వినియోగదారులపై ధరల భారం పడకుండా ప్రభుత్వం లీటరుపై రూ.10 ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిందన్నారు. సంక్షోభ సమయంలో ఇంధన కొరత ఏర్పడుతుందని కొందరు ప్రజల్లో భయాందోళనలు సృష్టించి రాజకీయాలు చేసే ప్రయత్నం చేశారని, వారు ప్రస్తుతం నిరాశలో కూరుకుపోయారని ఆయన ఎద్దేవా చేశారు. దేశ యువత స్వదేశీ చిప్‌లతో కృత్రిమ మేధస్సు భవిష్యత్తును నిర్మిస్తుందని మోదీ చెప్పారు. గుజరాత్‌ సనంద్‌లో సెమీ కండక్టర్ల తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

Updated Date - Jul 05 , 2026 | 05:52 AM