దివ్యాంగ నిబంధనల్లో కేంద్రం మార్పులు
ABN , Publish Date - Nov 22 , 2026 | 07:54 AM
దివ్యాంగుల హక్కుల చట్టం 2016 కింద వైకల్యాలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. మార్చి 2024 నిబంధనల స్థానంలో..
వైకల్యం పరిధిలోకి మరుగుజ్జుతనం, ఆటిజం, రక్తరుగ్మతలు
న్యూఢిల్లీ, నవంబరు 21: దివ్యాంగుల హక్కుల చట్టం 2016 కింద వైకల్యాలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. మార్చి 2024 నిబంధనల స్థానంలో నవంబరు 18 విడుదల చేసిన మార్గదర్శకాలు తక్షణం అమలులోకి వస్తాయని పేర్కొంది. సవరించిన నిబంధనల్లో లోకోమోటర్ డిజెబిలిటీ, దృష్టి-వినికిడి లోపం, వాక్-భాషా వైకల్యం, నిర్దిష్ట అభ్యసన వైకల్యం, మేధో వైకల్యం, ఆటిజం, మానసిక వైకల్యం, రక్త-దీర్ఘకాలిక నాడీ సంబంధిత రుగ్మతలు, మరుగుజ్జుతనం వంటి కీలక విభాగాలు ఉన్నాయి. అవయవం తొలగింపునకు తప్ప మిగిలిన వైకల్యాలకు లక్షణాలు కనిపించిన ఆరు నెలల తరువాత తాత్కాలిక ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. 18 ఏళ్లు నిండిన తరువాత శాశ్వత ధ్రువీకరణ పత్రం జారీ చేస్తారు. అవసరాన్ని బట్టి ప్రతి 10 ఏళ్లకోసారి పునఃపరిశీలన చేస్తారు. పెద్దవారిలో ఎత్తు 4 అడుగుల 8 అంగుళాలకంటే తక్కువ ఉంటే మరుగుజ్జుతనంగా పరిగణిస్తారు. తగ్గే ప్రతి అంగుళం ఎత్తుకు 4శాతం శాశ్వత అంగవైకల్యం కింద లెక్కగడతారు. హిమోఫీలియా, తలసేమియా, సికిల్ సెల్ రుగ్మతలకు వ్యాధి తీవ్రతనుబట్టి 40శాతం వైకల్యంగా గుర్తిస్తారు. నెలలో ఎన్నిసార్లు మూర్ఛ వస్తుందన్నదానిని బట్టి గరిష్ఠంగా 75శాతం వైకల్యంగా గుర్తిస్తారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాలనాయంత్రాంగం నియమించిన అర్హత కలిగిన అధికారులు వైకల్య ధ్రువీకరణ పత్రాలను,యూడీఐడీలను జారీ చేస్తారు.